వైసీపీ హత్యాకాండ!
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:06 AM
వైసీపీ రాష్ట్ర యూత్ కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి(33) గురువారం రాత్రి.. సొంత పార్టీ నేతల చేతిలోనే దారుణహత్యకు గురయ్యారు.
సొంత పార్టీ నేతల చేతిలో.. వైసీపీ నేత చెన్నారెడ్డి దారుణహత్య
కార్లతో అడ్డగించి.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో దాడి చేసి చంపిన నిందితులు
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడే దారుణం చేయించాడని ఆరోపించిన మృతుని మామ
పార్టీని నమ్ముకున్నందుకు తన కొడుకును బలి తీసుకున్నారని కన్నీరుమున్నీరైన తల్లి
ఆసుపత్రి వద్ద పిన్నెల్లి సోదరులపై ఆగ్రహం
పల్నాడులో ఘటన.. పలువురిపై కేసు
రెంటచింతల/గురజాలటౌన్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాష్ట్ర యూత్ కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి(33) గురువారం రాత్రి.. సొంత పార్టీ నేతల చేతిలోనే దారుణహత్యకు గురయ్యారు. పక్కా ప్రణాళికతో రెండు వాహనాలతో వెంటబడి.. చెన్నారెడ్డిని మార్గమధ్యంలో అడ్డగించి.. కళ్లల్లో కారం కొట్టి దారుణంగా నరికి చంపారు. కాగా, వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో ఈ హత్య చేయించారని చెన్నారెడ్డి బంధవులు ఆరోపించారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన చెన్నారెడ్డి గురువారం రాత్రి పాలువాయిజంక్షన్‌కు వెళ్లి మిర్చి మొక్కలను పరిశీలించి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రెండు కార్లలో చెన్నారెడ్డిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు నిందితులు.. ఆయన రెంటాల గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పూలోళ్ల బావి ప్రాంతంలో చెన్నారెడ్డి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన చెన్నారెడ్డి పైకిలేచేలోపే.. ఆయన కళ్లల్లో కారం చల్లి కత్తులతో కుడి చేయి, ఛాతీ మీద బలంగా పొడిచారు. అయితే, అప్పటికీ ప్రాణంపోలేదని భావించిన నిందితులు చెన్నారెడ్డి తలను గట్టిగా పట్టుకుని గొంతు కోశారు. దీంతో చెన్నారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం.. రోడ్డుపై పడిన రక్తాన్ని తుడిచిన నిందితులు.. చెన్నారెడ్డి మృతదేహాన్ని రోడ్డుకు పక్కగా పొలాల్లోకి విసిరేసి పారిపోయారు. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ బి. మహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి నవులూరి అశోక్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, రాజశేఖరరెడ్డి సహా మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బి.మహేశ్వరరావు చెప్పారు.
వెంట్రామిరెడ్డే సూత్రధారి: చెన్నారెడ్డి కుటుంబం
చెన్నారెడ్డి దారుణహత్య వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కీలక సూత్రధారి అని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురుజాల ప్రభుత్వాసుపత్రికి వచ్చిన పిన్నెల్లి సోదరులపై విరుచుకుపడ్డారు. చెన్నారెడ్డి మామ రంగారెడ్డి, మరికొందరు బంధువులు పిన్నెల్లి సోదరులను అడ్డుకొని తిట్టిపోశారు. ‘‘ఈ హత్యకు కారణం నీ సోదరుడు వెంకట్రామిరెడ్డి కాదా..?’’ అంటూ రామకృష్ణారెడ్డిని నిలదీశారు. ‘‘నా కొడుకు గొంతుకోసి, కడుపుకోత మిగిల్చి వేడుకకు వచ్చారా..’’ అంటూ తల్లి బోరున విలపించారు. దీంతో పిన్నెల్లి సోదరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, రెంటాలలో చెన్నారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
మన పార్టీవాళ్లే చంపేశారన్నా..!
చెన్నారెడ్డి దారుణ హత్య గురించి తెలిసిన వైసీపీ అధినేత జగన్.. ఆయన తండ్రి భాస్కరరెడ్డిని ఫోన్‌లోనే పరామర్శించారు. ‘‘అసలేం జరిగింది?’’ అని ప్రశ్నించారు. దీంతో భాస్కరరెడ్డి ఫోన్‌లోనే బిగ్గరగా ఏడుస్తూ.. ‘‘అన్నా నా కుమారుడిని మన వైసీపీ నేతలే చంపేశారన్నా.’’ అని వివరించారు. దీంతో జగన్ మౌనం వహించినట్టు తెలిసింది.