Share News

వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గొడ్డలి పార్టీ

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:36 AM

వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదని, గొడ్డలి పార్టీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.

వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గొడ్డలి పార్టీ

  • జగన్‌ గొడ్డలి రాజకీయం ఉగ్రవాదం కంటే భయంకరం

  • నరుకుతాం.. చంపేస్తామనడం వైసీపీ సంస్కృతికి నిదర్శనం

  • విధ్వంసం, వినాశనమే లక్ష్యం.. ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి: నిమ్మల

అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదని, గొడ్డలి పార్టీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. విధ్వంసం, వినాశనమే లక్ష్యంగా వైసీపీ రాష్ట్రంలో గొడ్డలి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు కాపాడుతామని చెబుతుందని, కానీ వైసీపీ మాత్రం విధ్వంసాన్ని సృష్టిస్తామని చెబుతోందని అన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ రాజకీయ ఉగ్రవాదిగా మారిపోయారని, వైసీపీ జెండాను పక్కన పెట్టి గొడ్డలిని జెండాగా చేసుకున్నారని అన్నారు. రక్తచరిత్రనే రాజనీతిగా మార్చుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్‌ వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ‘చంపేస్తాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం’ అనే సిద్ధాంతంతో వైసీపీ పని చేస్తోందని అన్నారు. ఆ పార్టీ నేతలు వాడుతున్న ఆ పదాలే వైసీపీ సంస్కృతిని చాటుతున్నాయన్నారు. ‘పనులు నిలిపేస్తాం, నిర్మించినవి పడగొడతాం, యువతను చెడగొడతాం, డ్రగ్స్‌ అమ్ముతాం, మహిళలను గెంటేస్తాం’ అని వైసీపీ హామీలు ఇస్తోందని విమర్శించారు. రాజకీయాలకు అడ్డు వస్తే సొంత బాబాయ్‌ వివేకాపై కూడా గొడ్డలిపోటు వేసిన చరిత్ర వైసీపీ సొంతమని దుయ్యబట్టారు. సొంత తల్లి, చెల్లికి ఎలాంటి అన్యాయం చేశామో, రాష్ట్ర మహిళలకు అదే తరహా అన్యాయం చేస్తామని వైసీపీ తన విధానాన్ని ప్రకటించిందన్నారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందని, కొత్త డ్రగ్స్‌ తెస్తామని, ఇలాంటి వ్యాపారాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామని వైసీపీ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా తెగబడతామనేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు.


అధికారం పోయినా బెదిరింపులు

వైసీపీ అధికారంలోకి వస్తే గుంటూరు ఇవతల వారిని ఇళ్లల్లో నుంచి బయటకు లాగి మరీ తంతామని, గుంటూరు అవతల ఉన్న వారిని ఇళ్లలోకి వచ్చి మరీ చంపుతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని నిమ్మల అన్నారు. 2029లో అధికారంలోకి వస్తే పొట్టేళ్లను నరికినట్లు తలలు నరికేస్తామని బహిరంగంగానే ఆ పార్టీ నేతలు చెబుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సినే నేతలే హత్యా రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరమన్నారు. తల్లులకు పుత్రశోకం మిగిల్చేందుకు, భార్యలకు మాంగల్యం దూరం చేసేందుకే వారు అధికార దాహంతో రగిలిపోతున్నారని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను లేపేస్తామని, కొత్త పలుకు లేకుండా చేస్తామని ఫోర్త్‌ ఎస్టేట్‌ను వైసీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా సిగ్గు తెచ్చుకోకుండా వ్యవహరిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు.


జగన్‌ జవాబు చెప్పాలి

పరిటాల రవి, వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా ఎందుకు మరణిస్తున్నారో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివేకా మరణానికి గొడ్డలిపోటు కారణమైతే గుండెపోటు అని ఎందుకు చెప్పారో జగన్‌ చెప్పాలన్నారు. ‘వంగవీటి రంగాను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు ఏ పార్టీలో ఉంది? వంగవీటి రంగాను రౌడీ అని అభివర్ణించిన గౌతమ్‌రెడ్డికి పదవి ఇచ్చి జగన్‌ రెడ్డి తన అక్కున చేర్చుకున్నారు. రంగాను చంపిన కుటుంబానికి వేల కోట్ల రూపాయలు మేలు కలిగేలా హైదరాబాద్‌లో ఆస్తులు కట్టబెట్టింది వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాదా? కాపుల గురించి, రంగా గురించి మాట్లాడే అర్హత వైసీపీకి, జగన్‌కు లేదు’ అని స్పష్టం చేశారు. పరిటాల రవి హత్య కేసు నుంచి బయటపడటానికి జగన్‌కు ఆరు నెలలు పట్టిందని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారని, నాడు రవి కేసులో సాక్షులు ఎలాగైతే మాయమయ్యారో నేడు వివేకా హత్య కేసులో సాక్షులు కూడా అలాగే మాయమవుతున్నారని అన్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై ఆచూకీ కూడా లభించని సమయంలో సీఎం కుర్చీపై కాంక్షతో సంతకాలు సేకరించి సీఎం కావాలని చూడటం జగన్‌ వికృత మనస్తత్వానికి నిదర్శనమని నిమ్మల అన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 04:37 AM