Share News

వైసీపీ ఫ్లాప్‌ షో!

ABN , Publish Date - Jul 15 , 2026 | 03:48 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ (తారక్‌) రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని గత కొంతకాలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తమ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా

వైసీపీ ఫ్లాప్‌ షో!

  • రాజకీయాల్లోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ ప్రచారం

  • ‘రా ఎన్టీఆర్‌’ పేరుతో తిరుపతిలో

  • మీడియా సమావేశమంటూ హడావుడి

  • తెర వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలు

  • కర్త, కర్మ, క్రియ వారే.. ఖర్చులూ వారివే

  • ఓ దశలో తారక్‌ కూడా వస్తున్నట్లు ప్రచారం

  • కూటమిలో చిచ్చు, అస్థిరతే అసలు లక్ష్యం

  • టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టే టార్గెట్‌

  • వెంటనే రంగంలోకి జూ.ఎన్టీఆర్‌ కార్యాలయం

  • ‘రా ఎన్టీఆర్‌’తో సంబంధం లేదని ప్రకటన

  • దీంతో షాకైన వైసీపీ నేతలు

వైసీపీ చేసిన మరో ప్రయోగం వికటించింది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ నేతలు తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరూ వాడుకున్నారు. తిరుపతిలో ‘రా ఎన్టీఆర్‌’ పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్‌ రాజకీయ అరంగేట్రం ముహూర్తం ఖరారుకు ఇదే వేదిక కానుందని ఊదరగొట్టారు. అయితే ఈ ప్రయోగం ఆదిలోనే బెడిసికొట్టింది. ‘రా ఎన్టీఆర్‌’తో సంబంధం లేదని జూనియర్‌ ఎన్టీఆర్‌ కుండబద్దలు కొట్టారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జూనియర్‌ ఎన్టీఆర్‌ (తారక్‌) రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని గత కొంతకాలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తమ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఈ నెల 18న తిరుపతిలో ‘రా ఎన్టీఆర్‌ (ఆర్‌ఏడబ్ల్యూ ఎన్టీఆర్‌)’ పేరుతో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశాన్ని వాడుకునేందుకు సిద్ధమయ్యారు. ‘ఊరూ వాడ’ పేరుతో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించేందుకు జూనియర్‌ అభిమానులమంటూ కొందరు తలపెట్టిన ఈ మీడియా సమావేశం వెనుక కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ నాయకులే కావడం గమనార్హం. జూనియర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహకంగా ‘రా ఎన్టీఆర్‌’ కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేశారని వారు ఊదరగొడుతూ వచ్చారు. ఓ దశలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా హాజరవుతారని.. ఆయన రాజకీయ ప్రవేశంతో టీడీపీ పని అయిపోయినట్లేనంటూ తమకు అనుకూల మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ‘రా ఎన్టీఆర్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఏర్పాట్లు చేశారు. మొత్తం ఖర్చంతా వారిదే.


ఎన్టీఆర్‌ వివరణతో వైసీపీకి షాక్‌..

‘రా ఎన్టీఆర్‌’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి గానీ, ఆ పేరుతో ఉండే సంస్థకు గానీ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సదరు మీడియా సమావేశానికి, ఆ సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఆయన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేల్చిచెప్పింది. ‘రా ఎన్టీఆర్‌’ పేరుతో ఉన్న సంస్థకు ఆయన తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారం లేదని విస్పష్టంగా చెప్పింది. జూ.ఎన్టీఆర్‌ అధికారికంగా ధ్రువీకరించని సమాచారాన్ని మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయవద్దని కూడా కోరింది. దీంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ నాయకులు షాకయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించాలన్న వారి ప్రయత్నం కొన్ని గంటల్లోనే మిస్‌ ఫైర్‌ అయింది. కూటమి పార్టీల నడుమ చిచ్చుపెట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌ ద్వారా జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విషం చిమ్మడం కూడా అందులో భాగమే.

Updated Date - Jul 15 , 2026 | 03:49 AM