Share News

ఇవేం వ్యాఖ్యలు జగన్‌?!

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:18 AM

మాజీ సీఎం జగన్‌, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు వ్యతిరేకంగా పలాసలో యాదవ సంఘాలు రోడ్డెక్కాయి. సీదిరి కుమారుడు బైక్‌తో ఢీకొట్టడంతో మరణించిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి..

ఇవేం వ్యాఖ్యలు జగన్‌?!

  • 18 ఏళ్ల కుర్రాడు చంపేస్తే తప్పు లేదా?

  • వైసీపీ అధినేతపై యాదవ సంఘాల ఆగ్రహం

శ్రీకాకుళం/పలాస, జూలై 14(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు వ్యతిరేకంగా పలాసలో యాదవ సంఘాలు రోడ్డెక్కాయి. సీదిరి కుమారుడు బైక్‌తో ఢీకొట్టడంతో మరణించిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. యాదవ సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించారు. సీదిరి కుమారుడి చర్యను వెనుకేసుకువచ్చిన జగన్‌, దానయ్య కుటుంబా న్ని విస్మరించడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఓ పేద గొర్రెల కాపరి మృతికి కారణం కావడంతోపాటు కేసును దారి మళ్లించేందుకు, కుమారుడి స్థానంలో మరొకరిని నిందితునిగా తెరపైకి తెచ్చేందుకు సీదిరి చేసిన ప్రయత్నాలపై యాదవ సంఘాలు తొలినుంచీ ఆగ్రహంతో ఉన్నాయి. మంగళవారం విశాఖ పర్యటనలో సీదిరి అప్పలరాజుకు అనుకూలంగా జగన్‌ వ్యాఖ్యలు చేయడం.. వారిని మరింత రగిలించింది. అప్పలరాజు కుమారుడిది తప్పే లేదన్నట్టు మాట్లాడిన జగన్‌.. బాధిత కుటుంబం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఈ ధోరణిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పలాసలో భారీ ఎత్తున యాదవ సంఘాల ఆధ్వర్యంలో జగన్‌, సీదిరి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.


జగన్‌ తీరు సిగ్గుచేటు: సప్ప నవీన్‌, యాదవ సంఘ నేత, పలాస

‘‘సీదిరి అప్పలరాజును దండించాల్సింది పోయి, ఆయన చర్యను జగన్‌ సమర్థించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు. మాజీ మంత్రి కుమారుడి కారణంగా ఓ నిండుప్రాణం బలయింది. వారి కుటుంబం వీధిన పడింది. ఆ కుటుంబానికి జగన్‌ ఏం సమాధానం చెబుతారు?’’

సీదిరినే ప్రశ్నించాలి: కామేశ్వరరావు యాదవ్‌, యాదవ సంఘం అధ్యక్షుడు

‘‘కేసు నుంచి కుమారుడ్ని తప్పించాలని చూసిన సీదిరిని జగన్‌ మందలిస్తారని మేం అనుకున్నాం. కానీ, మాజీ మంత్రి కుమారుడిని ఆయన వెనుకేసుకురావడం హేయం.’’

యాదవులంటే ఇంత చిన్నచూపా?: కృష్ణమూర్తి, యాదవ సంఘం నేత

‘‘యాదవులంటే జగన్‌కు చీపురుపుల్లతో సమానమనేది ఆయన ప్రకటనతోనే తెలిసిపోతోంది. సీదిరి కుటుంబానిది తప్పు అని చెప్పాల్సింది పోయి, వారి పక్షాన నిలబడి యాదవులకు అన్యాయం చేస్తున్నారు. జగన్‌ను యాదవసంఘం క్షమించదు.’’

మా కుటుంబ భారాన్ని ఎవరు మోస్తారు?

‘‘18 ఏళ్ల కుర్రోడు చంపేస్తే తప్పులేదా? మరి మా కుటుంబ భారాన్ని ఎవరు మోస్తారో జగన్‌ చెప్పాలి. ఆయన తన వ్యాఖ్యలతో ఒక్క దానయ్యనే కాదు.. మా కుటుంబం మొత్తాన్నీ చంపేశాడు.’’

- ద్రౌపది, బాధితుని భార్య;

కామమ్మ, బాధితుని తల్లి

Updated Date - Jul 15 , 2026 | 05:20 AM