Share News

కుల ప్రదర్శన కుదరదు!

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:03 AM

కార్ల అద్దాలపై ‘యాదవ్‌, క్షత్రియ, బ్రాహ్మిణ్‌, గుజ్జర్‌, రాజ్‌పుత్‌, జాట్‌’... అంటూ తమ కులాన్ని సగర్వంగా ప్రకటించుకోవడం ఉత్తరాదిలో ఓ ఫ్యాషన్‌! తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేం తక్కువ కాదు!

కుల ప్రదర్శన కుదరదు!

  • వాహనాలపై కులం పేరు రాసుకోవడం నేరం

  • బిహార్‌లో నిక్కచ్చి ఆదేశాలతో చట్టం అమలు.. రూ.500 నుంచి 2 వేల వరకు జరిమానా

  • అంతకుముందే యూపీలో ప్రత్యేక ఆదేశాలు.. సామాజిక సామరస్యం దెబ్బతింటుందనే!

  • ఏపీలోనూ వాహనాలపై కుల ప్రదర్శనలు

న్యూఢిల్లీ, జూలై 9: కార్ల అద్దాలపై ‘యాదవ్‌, క్షత్రియ, బ్రాహ్మిణ్‌, గుజ్జర్‌, రాజ్‌పుత్‌, జాట్‌’... అంటూ తమ కులాన్ని సగర్వంగా ప్రకటించుకోవడం ఉత్తరాదిలో ఓ ఫ్యాషన్‌! తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేం తక్కువ కాదు! అసలు విషయం ఏమిటంటే... ఇలా వాహనాలపై కులం పేర్లు ప్రదర్శించడం మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం నేరం! ఇలా ఎవరికి వారుతమ కులమే గొప్ప అనేలా వాహనాలపై రాతలు రాయడంవల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. బిహార్‌లో ఇటీవలే దీనిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘కార్లు, ఇతర వాహనాలపై కులం పేర్లు రాసిన స్టిక్కర్లను తీసేయాల్సిందే’ అని స్పష్టం చేశారు. లేనిపక్షంలో రూ.2వేలు జరిమానా తప్పదని హెచ్చరించారు. స్టిక్కర్ల తొలగింపునకు విధించిన గడువు ముగియడంతో... ఉల్లంఘనలపై చలాన్లు కూడా రాస్తున్నారు. కేంద్ర మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌, 1989 ప్రకారం... వాహనాలపై నంబర్‌ప్లేటు మినహా మరే రాతలూ ఉండకూడదు. మరీ ముఖ్యంగా సెక్షన్‌ 177 రెడ్‌ విత్‌ 179(1) ప్రకారం కులానికి సంబంధించిన రాతలు అసలే ఉండకూడదు. ‘గుజ్జర్‌ కింగ్‌, బ్రాహ్మిణ్‌ ప్రైడ్‌, క్షత్రియ టైగర్‌’... అంటూ తమ కులమే గొప్ప అనే రాతలతో సమాజంలో విద్వేషాలు చెలరేగే ప్రమాదముందని ఈ నిబంధన తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.


అయినా... చాలామంది తమ కులం పేర్లను వాహనాలపై గొప్పగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల బిహార్‌ సర్కారు దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయగా... అంతకుముందే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి పెద్దసంఖ్యలో చలాన్‌లు విధించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘మేం ఫలానా...’ అని రాసుకున్న వాహనాలు రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. ఇది నేరం అని వారికి తెలుసో, తెలియదో! కానీ... చట్టాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీసులు, రవాణా శాఖ అధికారులదే!

Updated Date - Jul 10 , 2026 | 04:03 AM