Share News

ధరపై దిగులు!

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:28 AM

రబీ ధాన్యం అమ్మకంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధరగా 1,777 ప్రకటించినా మిల్లర్లు మాత్రం రూ.1400లకే అడుగుతున్నారు. దీంతో రైతులంతా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన ధాన్యం పరిశీలనకు సాంకేతిక బృందం ఏర్పాటు చేయడం, ఆ బృందం పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి రావడంతో ఈ ధాన్యం మాకొద్దు అంటూ మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.

ధరపై దిగులు!

- రబీ ధాన్యం అమ్మకంపై రైతుల్లో ఆందోళన

- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,777

- మిల్లర్లు ఇస్తామంటున్నది రూ.1400

- కలెక్టర్‌ను ఆశ్రయించిన రైతులు

- ధాన్యం పరిశీలనకు సాంకేతిక బృందం ఏర్పాటు

- అధికశాతం నూకలు, పిండిగా బియ్యం మారుతున్నట్లు గుర్తింపు

- ఈ ధాన్యం మాకొద్దు అంటున్న మిల్లర్లు

- దిక్కుతోచనిస్థితిలో రైతులు

రబీ ధాన్యం అమ్మకంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధరగా 1,777 ప్రకటించినా మిల్లర్లు మాత్రం రూ.1400లకే అడుగుతున్నారు. దీంతో రైతులంతా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన ధాన్యం పరిశీలనకు సాంకేతిక బృందం ఏర్పాటు చేయడం, ఆ బృందం పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి రావడంతో ఈ ధాన్యం మాకొద్దు అంటూ మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం):

ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన వరి పంటకు మద్ధతు ధరపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వలకు సాగునీటిని విడుదల చేయకున్నా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం తదితర ప్రాంతాల్లో 7,274 హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమయ్యాయి. మిల్లర్లు ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విషయంలో ముందు వెనుకా ఆలోచిస్తున్నారు. ధాన్యంలో నాణ్యత లేదని, నూకలు అధికంగా రావటంతో పాటు మరపట్టిన సమయంలో బియ్యం పిండిగా మారిపోతున్నాయని, బస్తాకు రూ.1400లకు మించి ఇవ్వలేమని మిల్లర్లు ఇటీవలే తేల్చిచెప్పారు. దీంతో రబీ ధాన్యానికి కనీసం రూ.1500 అయినా ఇప్పించాలని కోరుతూ గత సోమవారం కలెక్టర్‌ను కలిసిన రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యంలో నాణ్యతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ రైతులకు హామీ ఇచ్చారు. సాంకేతిక బృందాన్ని ఆయా గ్రామాలకు పంపి ధాన్యంలో నాణ్యతపై పరిశీలన చేయించారు.

సాంకేతిక బృందం పరిశీలనలో తేలిన అంశాలు ఇలా..

కలెక్టర్‌ నియమించిన సాంకేతిక బృందం ఈ నెల 14వ తేదీన కోలవెన్ను, పునాదిపాడు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ధాన్యం శాంపిళ్లను సేకరించి నాణ్యతను పరిశీలించింది. యంత్రాల ద్వారా కోసిన ధాన్యంలో 25 నుంచి 27 పాయింట్లు తేమశాతం ఉన్నట్లుగా గుర్తించారు. తప్ప, తాలు మూడు శాతానికి బదులు 10.07 శాతం, పరిపక్వత కాని గింజలు, కేళీలు ఒక శాతానికి బదులుగా 3.4 శాతం, ఇతరత్రా లోపాలు 1.2 శాతానికి బదులుగా ఐదు శాతం ఉన్నట్లు గుర్తించింది. రబీ సీజన్‌లో ఎంటీయూ - 1153, 1156 రకాలను అధికంగా సాగుచేశారు. ఈ ధాన్యం మినీ మిల్లింగ్‌ మిషన్‌లో వేసి మరపడితే నూకశాతం అధికంగా వస్తోంది. దీంతో పాటు బియ్యం సక్రమంగా లేకుండా పిండి మాదిరిగా అయిపోతోంది. ఈ వివరాలన్నింటిని సాంకేతిక నిపుణుల బృందం కలెక్టర్‌కు నివేదించింది.

ఎకరానికి రూ.45 వేల వరకు ఖర్చు

రబీ సీజన్‌లో బోరు నీటి ఆధారంగా వరి సాగు చేశామని, ఎకరానికి పెట్టుబడిగా రూ.40 నుంచి రూ.45 వేలు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన దశలో ధాన్యం శాంపిళ్లను మిల్లర్ల వద్దకు తీసుకువెళ్లి చూపితే ధాన్యం మరపడితే నూకశాతం అధికంగా వస్తోందని, బస్తాకు రూ.1400 మించి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీంతో ఖంగుతిన్న రైతులు బస్తాకు రూ.1500 అయినా ధర ఇప్పించాలని కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తోందని, మద్దతు ధర విషయంలో రూ.18వేలకుపైగా నష్టపోతున్నామని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో రబీలో సాగు చేసిన పంట నాణ్యతను పరిశీలించేందుకు సాంకేతిక బృందాలను కలెక్టర్‌ పంపటంతో మిల్లర్లు బస్తాకు రూ.1400 చొప్పున ఇస్తామన్న ధర కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికంగా ఎరువులు వినియోగించటం కారణమా..!

రబీ సీజన్‌లో సాగు చేసే వరి వంగడాలు 120 రోజులకు కోతకువస్తాయి. ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే అధిక దిగుబడులు సాధించాలనే భావనతో రైతులు ఎరువులను నాలుగు కోటాలుగా వేయటం, మరో మూడు, నాలుగు సార్లు పురుగు మందులు పిచికారీ చేయటంతో ఎకరానికి రూ.45 వేల వరకూ ఖర్చయినట్లు రైతులే చెబుతున్నారు. అధిక దిగుబడులు సాధించాలనే కారణంతో ఎరువులు అధికంగా వినియోగించటంతో ధాన్యంలో నాణ్యత తగ్గిపోయిందని వ్యవసాయశాఖ నిపుణులు అంటున్నారు. గతంలో రబీ సీజన్‌లో అయినా కోత కోసి కుప్పలు వేసిన అనంతరం కొద్దిరోజులు ఆగి నూర్పిడిలు చేసేవారని, ప్రస్తుతం యంత్రాల ద్వారా వరికోత, నూర్పిడి చేస్తుండటంతో ధాన్యంలో తేమశాతం ఆరక మిల్లర్లు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. ధాన్యంలో తేమశాతం బస్తాకు 17 పాయింట్లు ఉంటే రూ.1,770 మద్దతు ధర లభిస్తుంది. ప్రస్తుతం యంత్రాల ద్వారా వరికోతలు కోస్తుండటంతో 25 నుంచి 27 పాయింట్లు తేమశాతం ఉంటోంది. దీంతో బస్తాకు రూ.150 నుంచి రూ.160 వరకూ కోల్పోవాల్సివస్తోంది. ఇంత తేడా ఉన్నప్పటికీ రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు సుముఖంగా లేని పరిస్థితి నెలకొంది. డ్రయ్యర్‌ ఉన్న మిల్లులకు ధాన్యం పంపాలని రైతులు కోరుతుండటంతో తేమశాతం ఆధారంగా మద్దతు ధర నిర్ణయించాల్సిన స్థితి నెలకొంది. వరికోతల సమయంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతేలు ధాన్యం ఆరబెట్టేందుకు ముందుకురావటం లేదు. ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు చేసిన ధాన్యంలో నాణ్యత లోపించటంతో ఇన్ని ఇబ్బందుల మధ్య మద్దతు ధర ఎంతమేర లభిస్తుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

అధికారుల నిర్ణయంపైనే..

రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంట నాణ్యత సక్రమంగా లేకపోవటంతో అధికారులు మిల్లర్లతో సంప్రదింపులు జరిపి ఎంతమేర మద్దతు ధర ఇప్పిస్తారనే అంశంపై రైతుల్లో చర్చ నడుస్తోంది. రబీ సీజన్‌లో జిల్లాలో 54 వేల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత బుధవారం కంకిపాడులో డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్న మిల్లుకు రెండు లారీల ధాన్యం వెళితే ధాన్యం పరిశీలించిన మిల్లర్లు ధాన్యంలో నాణ్యత తగ్గిందని, ఈ తరహా ధాన్యం తాను కొనుగోలు చేయలేమని తెగేసిచెప్పినట్లు సమాచారం. ఈ అంశం అధికారుల దృష్టికి వెళ్లింది. ధాన్యంలో నాణ్యత, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మిల్లర్లతో సంప్రదింపులు జరిపి రైతులకు న్యాయం చేసేవిధంగా మద్దతు ధర ఇప్పిస్తామని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. తేమశాతం 17 శాతం వరకు తగ్గేవరకూ ఆరబెడితే మద్దతు ధర కొంతమేర పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:29 AM