Guntur: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:03 AM
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
గుంటూరులో ఏర్పాట్లు పూర్తి
గుంటూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అన్నమయ్య కీర్తనలు, సహస్ర గళార్చనల నడుమ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా, గజల్ శ్రీనివాస్ తెలుగు మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు. గుంటూరు నగర శివార్లలోని శ్రీ సత్యసాయి స్పిరిట్యూయల్ సిటీలోని తెలుగు మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరో ఐదు ఉప వేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు 3, 4, 5 తేదీల్లో జరుగుతాయి. దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరుకానున్న దృష్ట్యా వారందరికీ ఆంధ్ర సారస్వత పరిషత్ వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తోంది. 60 విద్యాసంస్థల నుంచి 25 వేల మంది విద్యార్థులు ఈ తెలుగు మహాసభలను సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తెలు గు వెలుగులు పేరుతో తెలుగు భాష ఉన్నతి కోసం కృషి చేసిన 350 మంది ప్రముఖుల చిత్రపటాలను ప్రాంగణమంతా ఏర్పాటు చేశారు. 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.