వందేళ్ల ప్లానింగ్‌తో అమరావతి వరద నియంత్రణ
ABN , Publish Date - May 12 , 2026 | 04:56 AM
రాజధాని అమరావతికి నూరేళ్ల ముందస్తు ఆలోచనతో వరద నియంత్రణకు బృహత్తర ప్రణాళిక రచించామని, దాని ఆధారంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు...
రాజధానిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం
తుళ్లూరు, మే 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి నూరేళ్ల ముందస్తు ఆలోచనతో వరద నియంత్రణకు బృహత్తర ప్రణాళిక రచించామని, దాని ఆధారంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్, ఎండీ లక్ష్మీ పార్థసారథి వివరించారు. ప్రపంచ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రెస్క్యూ ఆఫీసర్ డెన్సీస్ మెక్‌లాగిన్‌తో కూడిన 9 మంది సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ-3, ఎన్-16 జంక్షన్ వద్ద గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులను పరిశీలించిన బృందానికి.. అమరావతి వరద నియంత్రణ, దానిపై టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిని సీఎండీ వివరించారు. కొండవీటి వాగు, పాలవాగు పరీవాహక ప్రాంతాన్ని సుందర అవెన్యూ ప్లాంటేషన్‌తో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెనుమాక రిజర్వాయర్‌ను 0.1 టీఎంసీ, శాఖమూరులో 0.03 టీఎంసీ, నీరుకొండ రిజర్వాయర్ 0.4 టీఎంసీల సామర్థ్యంతో వరద నియంత్రణకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.