Share News

కుప్పకూలిన శ్లాబు

ABN , Publish Date - May 04 , 2026 | 04:38 AM

పాత శ్లాబు ఎత్తు పెంచేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కుప్పకూలిన శ్లాబు

  • కార్మికుడి దుర్మరణం..మరో ముగ్గురికి గాయాలు

  • పాత శ్లాబును ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం

పెదగంట్యాడ, (విశాఖపట్నం), మే 2 (ఆంధ్రజ్యోతి): పాత శ్లాబు ఎత్తు పెంచేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు...విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం వికా్‌సనగర్‌ మెయిన్‌ రోడ్డు పక్కన నవీన్‌కుమార్‌కు ఓ పాత షాపు ఉంది. సుమారు 13 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పున్న ఈ షాపు శ్లాబు ఎత్తు పెంచేందుకు ఆరుగురు కూలీలను నియమించారు. వారు ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 12 జాకీలతో శ్లాబును పైకి ఎత్తే ప్రయత్నంచేశారు. ఈ నేపథ్యంలో శ్లాబు రెండు ముక్కలుగా విరిగిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తిమ్మల నాగేశ్వరరావు (38) మృతిచెందగా, సొంగల ప్రసాదరావు, నారాయణరావు, సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు కార్మికులు రాజు, నారాయణ ప్రమాదం నుంచి తప్పించకున్నారు. శకలాల్లో చిక్కుకున్న కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. న్యూపోర్టు పోలీసులు గంగవరం పోర్టు నుంచి క్రేన్‌ను రప్పించి, శ్లాబును పైకి లేపి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. న్యూపోర్టు సీఐ టి.కామేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 04 , 2026 | 04:38 AM