Share News

డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు

ABN , Publish Date - May 14 , 2026 | 12:07 AM

పార్లమెంటులో 2023 సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు యత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా అన్నారు.

   డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా

కేంద్రం బిల్లును తిప్పికొట్టిన విపక్షాలు

సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా

పత్తికొండ టౌన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో 2023 సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు యత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా అన్నారు. బుధవరం పత్తికొండకు వచ్చిన ఆమె స్థానిక సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి బుజ్జల ఈశ్వరయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు విపక్ష పార్టీలు మహిళా బిల్లును తిప్పికొట్టారన్నారు. మహిళా బిల్లు కోసం అనేక ఏళ్లుగా సీపీఐ మహిళా సంఘాలు అటు పార్లమెంటులో, ఇటు బయట పోరాటాలు సాగించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 2023లో పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, మరోసారి డీలిమిటేషన్‌ ముసుగులో ఈ బిల్లును తీసుకురావడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపునకు మనదేశ ప్రధాని మోదీ పూర్తిగా లొంగిపోయారని, ట్రంప్‌ ఏది చెబితే అది తల ఊపేలా మోడీ వ్యవహరించే తీరు సరైంది కాదన్నారు. ప్రపంచ విశ్వగురువు అని చెప్పుకునే మోడీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు పేదలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకున్నారా అని ప్రశ్నించారు. ప్రధాని విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 25న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు.

నీట్‌ పేపర్‌ లీక్‌పై విచారణ చేపట్టాలి: బుజ్జల ఈశ్వరయ్య

2026 నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బుజ్జల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీట్‌ పేపర్‌ లీకుల వ్యవహారంలో ఆంధ్ర కార్పొరేట్‌ దిగ్గజాల హస్తం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోందన్నారు. ఈ సంఘటనపై చంద్రబాబు ప్రభు త్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా భద్రత వ్యవస్థను చేపట్టాలన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:07 AM