Share News

మహిళల ఆకాంక్షలను.. కాంగ్రెస్‌ చిదిమేసింది!

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:29 AM

కాంగ్రెస్‌ను మహిళలు క్షమించరని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా వారి ఆశలు, ఆకాంక్షలను ఆ పార్టీ చిదిమేసిందని విమర్శించారు.

మహిళల ఆకాంక్షలను.. కాంగ్రెస్‌ చిదిమేసింది!

  • ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి: రామ్మోహన్‌నాయుడు.. విపక్షాలన్నీ వెన్నుపోటు పొడిచాయి

  • నియోజకవర్గాల పునర్విభజనపై రాద్ధాంతం

  • దీనివల్ల ఎవరికి, ఏ రాష్ట్రానికి నష్టమో అవి స్పష్టంచేయాలి

  • ఒక్కో ఎంపీ పరిధిలో 40 లక్షల మంది ఉంటే అభివృద్ధి ఎలా: కేంద్ర మంత్రి

  • చట్టసభల్లో వారసత్వ మహిళలే తప్ప సామాన్యులు ఉండొద్దా: శ్రీనివాస వర్మ

  • 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన ఆక్రోశ్‌ ర్యాలీలు, నిరసనలు: మాధవ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ను మహిళలు క్షమించరని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా వారి ఆశలు, ఆకాంక్షలను ఆ పార్టీ చిదిమేసిందని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలసి రామ్మోహన్‌ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ రాజకీయ పార్టీకి అన్యాయం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ప్రాతిపదికన అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ ప్రక్రియ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ‘మహిళా సాధికారతకు అడ్డుపడాలని చూస్తున్న విపక్షాల కుట్రలు సాగవు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. అడ్డంకులను అధిగమించి న్యాయం చేస్తాం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. సమాజంలో తమ సత్తా చాటాలని మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకే 2023లో ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’ తీసుకొచ్చాం.


ఈ చారిత్రక బిల్లుకు నాడు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు విపక్ష పార్టీలన్నీ మహిళలకు వెన్నుపోటు పొడిచాయి’ అని మండిపడ్డారు. డీలిమిటేషన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారో అవి ప్రతి మహిళకూ సమాధానం చెప్పాలన్నారు. ‘గతంలో 4 సార్లు డీలిమిటేషన్‌ చేశారు. ఇవాళ కొత్తేం కాదు. 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభలో 550 మంది సభ్యులు ఉండాలని అప్పటి నేతలు చెప్పారు. ఇప్పుడు దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ లెక్కన ఎన్ని సీట్లు పెంచాలో ప్రతిపక్షాలే చెప్పాలి. కొన్ని లోక్‌సభ స్థానాల్లో 40 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఒక ఎంపీ అంత మందికి న్యాయం చేయడం సాధ్యమేనా? విపక్ష నేతలకు మహిళలపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. బిల్లును వీగిపోయేలా చేసేందుకు రాజకీయ కుట్రలు పన్నారు. తాజా బిల్లు ప్రకారం ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయి. 50 శాతం అనే పదం బిల్లులో పెట్టాలని విపక్షాలు అడిగితే.. గంటలో సవరించి తెస్తామని హోం మంత్రి అమిత్‌షా చెప్పినా అవి అంగీకరించలేదు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వాటికి ఇష్టం లేదని అర్థమైంది’ అని వ్యాఖ్యానించారు.


విభజన బిల్లులో పెట్టింది కాంగ్రెస్‌ కాదా?

డీలిమిటేషన్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లు పెంచుతామని ఎలా చెప్పిందని రామ్మోహన్‌ ప్రశ్నించారు. గతంలో కేంద్రం ఎలా డీలిమిటేషన్‌ చేసిందో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నామని, మార్పులేమీ చేయలేదని తెలిపారు. బిల్లులో తేదీలు తప్ప ఫుల్‌స్టాపులు, కామాలు కూడా ముట్టుకోలేదన్నారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ చెప్పినట్లే సీట్లు పెరుగుతాయని చెప్పినా ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు విపక్షాలు ఏవేవో చెబుతున్నాయని.. మహిళలకు న్యాయం చేసేంత వరకు ఎన్‌డీఏ ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు. మాధవ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన ఆక్రోశ్‌ ర్యాలీలు, నిరసనలు చేస్తామని తెలిపారు.


రేవంత్‌ అడిగితేనే అపాయింట్‌మెంట్‌: శ్రీనివాసవర్మ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఇంట్లో అల్పాహార విందుకు హాజరు కావడంపై సోషల్‌ మీడియాలో అనవసర రాద్ధాంతం జరుగుతోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డితో ఎన్‌డీఏ నేతల అల్పాహార విందుపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ‘తెలంగాణకు మా ఉక్కు శాఖ నుంచి 2,500 ఈవీ బస్సులకు ఆమోదం తెలిపాం. అవి త్వరగా అందించాలని కోరడానికి కుమారస్వామితోపాటు నన్ను రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ అడిగారు. పార్లమెంటులో స్వయంగా కలుస్తానని చెప్పారు. ఏపీకి చెందిన కూటమి మహిళలకు మా ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశాం. అక్కడికి కుమారస్వామి సైతం వచ్చారు. ఇద్దరం కలుస్తాం కదా అని రేవంత్‌రెడ్డిని మా ఇంటికే రమ్మని చెప్పాను. వచ్చి వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. ఇందులో తప్పేముంది? కావాలనే కొందరు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని ఆక్షేపించారు. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కనిమొళి, డింపుల్‌ యాదవ్‌ వంటి వారసత్వ మహిళలు చట్టసభల్లో ఉండొచ్చు గానీ.. సాధారణ మహిళలు ఆ సభలకు రాకూడదా అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Apr 20 , 2026 | 04:32 AM