ఇదో చరిత్రాత్మక ఘట్టం!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:47 AM
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందే రోజు.. ఏప్రిల్ 16వ తేదీ.. భారత ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
‘నారీశక్తి వందన్’.. రాజకీయాలకతీతం: చంద్రబాబు
మహిళా బిల్లుకు మద్దతివ్వాలంటూ పార్టీలకు సీఎం లేఖ
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందే రోజు.. ఏప్రిల్ 16వ తేదీ.. భారత ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లు మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుందన్నారు. ‘నారీశక్తి వందన్’కు పార్లమెంటులో మద్దతివ్వాలని వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు ఆయన మంగళవారం లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ఈ సవరణ బిల్లుకు మద్దతు పలకాలని అందులో కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వైసీపీ అధ్యక్షుడు జగన్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు వాటిని పంపారు. ‘మహిళా రిజర్వేషన్‌పై అంతా ఒకే స్వరం వినిపించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డల తరఫున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నా. అన్ని పార్టీలు, పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా ఇందుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకునే ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం.
నారీ శక్తికి వందనం పలికే గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉండాలి. ఈ చట్టం రాజకీయాలకు అతీతం. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం.’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు... చంద్రబాబు నేతృత్వంలో బుధవారం కూటమి పార్టీల అధ్యక్షులైన పవన్ కల్యాణ్, మాధవ్ సమావేశం కానున్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరుపతలపెట్టిన సంబరాలపై చర్చించనున్నారు.
కూటమి మహిళలు చలో ఢిల్లీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంగా బిల్లుకు మద్దతుగా ఢిల్లీ వెళ్లాలని కూటమిపార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రి లోకేశ్ కోరారు. గురువారం లోక్‌సభ గ్యాలరీలో కూర్చుని బిల్లు ఆమోదం పొందే చరిత్రాత్మక క్షణాలను వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.