ఎవరు అడ్డుకున్నా మహిళా రిజర్వేషన్ ఆగదు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:52 AM
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు అడ్డుకున్నా ఆగదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాల యం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విశాఖపట్నం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు అడ్డుకున్నా ఆగదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాల యం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ‘జనాభాలో సగం ఉన్న మహిళలకు తగిన న్యాయం జరగాలి. మహిళల మేలు కోసమని తీసుకువచ్చిన చట్టాన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు. ఈరోజు కాకపోతే రేపైనా కచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలోనే నా జీవితం ఎదుగుదలకు తొలిమెట్టు పడింది. తెన్నేటి విశ్వనాథం వంటి వ్యక్తులతో గడిపిన క్షణాలు నాలో మార్పునకు నాంది పలికాయి. విద్యతో పాటు జీవితంలో విలువలు, సంస్కారం ముఖ్యం. నేటి యువ న్యాయవాదులు వాటిని మరిచిపోకూడదు. సాంకేతికతను అందిపుచ్చుకొని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని వెంకయ్య నాయుడు అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ముద్రించిన ప్రత్యేక సంచికను అతిథులతో కలసి ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్, ఏయూ ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.