హస్తినలో కూటమి మహిళల సందడి
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:12 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటులో గురువారం కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఢిల్లీలో కూటమి మహిళా నేతలు సందడి చేశారు.
మహిళా బిల్లుపై చర్చను గ్యాలరీ నుంచి వీక్షించిన నేతలు
ప్రధాని, అమిత్‌షా, శబరి ప్రసంగాలను ఆలకించిన వైనం
పార్లమెంటు ప్రాంగణంలో మన కేంద్ర మంత్రులతో భేటీ
నేడు కూడా పార్లమెంటుకు వెళ్లనున్న మహిళా నేతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటులో గురువారం కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఢిల్లీలో కూటమి మహిళా నేతలు సందడి చేశారు. గ్యాలరీలో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు లోక్‌సభలో జరిగిన చర్చను ప్రత్యక్షంగా తిలకించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, బైరెడ్డి శబరి తదితరుల ప్రసంగాలను ఆలకించారు. వీరిలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, శాసనసభలో విప్‌లు మాధవి, తంగిరాల సౌమ్య, జగదీశ్వరి, ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, ఎమ్మెల్యేలు శ్రావణి, విజయశ్రీ, భూమా అఖిలప్రియ, లోకం నాగమాధవి, పరిటాల సునీత, మిరియాల శిరీషాదేవి, సత్యప్రభ, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు సావిత్రి, పీతల సుజాత, ఉండవల్లి శ్రీదేవి, రాయపాటి శైలజ, తేజస్వి, స్వప్న, కమ్మరి పార్వతి, మన్నూరు సుగుణమ్మ, పాలవలస యశస్వి, కఠారి హేమలత తదితరులు ఉన్నారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా భారీగా కూటమి నేతలు తరలిరావడం చూసి పలు పార్టీల ఎంపీలు ఆశ్చర్యపోయారు. మహిళానేతలు, కూటమి ఎంపీలతో పార్లమెంటు ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కూటమి మహిళా నేతలు సమావేశమయ్యారు. నేడు కూడా వారు పార్లమెంటుకు హాజరవుతారు.
ఆస్తిలో సమాన హక్కు టీడీపీ చలవే: అనిత
మహిళా రిజర్వేషన్లపై పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది టీడీపీయేనని హోం మంత్రి అనిత గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా తమ పార్టీదేనన్నారు. చట్టసభల్లో వారికి 33శాతం రిజర్వేషన్ కోసం 1996 నుంచి టీడీపీ పోరాడుతోందని తెలిపారు. మహిళలకు ఆర్థిక భరోసా కోసం డ్వాక్రా సంఘా లు తీసుకొచ్చిందని.. మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని టీడీపీయే నెలకొల్పిందని వివరించారు. మంత్రి గుమ్మి డి సంద్యారాణి మాట్లాడుతూ.. మహిళా బిల్లు ఆమోదంతో రాబోయే రోజుల్లో ఏపీ అసెంబ్లీలో 100 మంది వరకు మహిళా ప్రతినిధులు ఉంటారని అన్నారు. చట్టసభల్లో 33 వాటా రావడం వల్ల ఆకాశంలో సగం, ఓటర్లలో సగం అయిన మహిళల సాధికారత దిశగా అడుగులు పడుతాయని మంత్రి సవిత తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారంటే దానికి కారణం నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు తీసుకున్న చర్యల ఫలితమేనని చెప్పారు. వారిద్దరూ మహిళా పక్షపాతులని.. మహిళా సాధికారత కోసం తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, వివిధ ప్రభుత్వ పథకాల్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని గ్రీనింగ్-బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఎం.సుగుణ అన్నారు. 33 శాతం వాటాతో కేవలం మహిళా ప్రతినిధుల సంఖ్య మాత్రమే పెరగదని, మహిళలకు సమానత్వం, సాధికారత కల్పించే దిశగా వేస్తున్న ముందడుగు అని చిత్తూరు అర్బన్ డెవల్‌పమెంట్ చైర్‌పర్సన్ కఠారి హేమలత చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కల్పనతో ప్రపంచంలోనే భారత్ సూపర్‌పవర్‌గా మారుతుందని రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి అన్నారు.
మహిళల భాగస్వామ్యం ఓ సామాజిక విప్లవం
‘‘దేశ రాజకీయ యవనికపై మహిళల భాగస్వామ్యం కేవలం ప్రాతినిధ్యం మాత్రమే కాదు.. అది ఒక సామాజిక విప్లవం. జనసేనాని పవన్ కల్యాణ్ 2019 మేనిఫెస్టోలోనే మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు చట్టసభల్లో ఉంటేనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందన్నది పవన్ బలమైన ఆకాంక్ష. డీలిమిటేషన్‌లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఏ రాష్ట్రానికీ సీట్ల సంఖ్య తగ్గదు. లోక్‌సభ స్థానాలను పెంచడం ద్వారా సమతుల్యత పాటిస్తున్నారు. 2029 నాటికి చట్టసభల్లో మహిళలు మూడోవంతు ప్రతినిధులుగా ఉండటం ద్వారా దేశ గమనమే మారుతుంది. భారత్ మరింత శక్తివంతంగా అవుతుంది. జనసేన పార్టీ తరఫున బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.’’

- లోక్‌సభ చర్చలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
మహిళా సాధికారతకు నాడు ఎన్టీఆర్.. నేడు మోదీ బాటలు
‘‘మహిళాభివృద్థి కాదు. మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి జరగాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. దేశంలోని 65 కోట్ల మంది మహిళల గొంతుకగా మాట్లాడుతున్నాను. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నాడు ఎన్టీఆర్, నేడు మోదీ నేతృత్వంలో మహిళా సాధికారతకు బాటలు పడ్డాయి. జాతీయ స్థాయిలో చట్టం రాకముందే, 19ఏళ్ల క్రితమే ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన గొప్ప నాయకుడి కుమార్తెగా గర్విస్తున్నాను. ఉమ్మడి ఏపీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, మహిళా పోలీస్‌స్టేషన్లు, మహిళా వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. యూపీఏ హయాంలో బిల్లును ఎందుకు అమలు చేయలేదు. నాడు బిల్లును చించినవారు నేడు మద్దతిస్తున్నామని చెప్పడం విడ్డూరం. మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్లను వాస్తవ రూపంలోకి తెస్తుంటే, ప్రతిపక్షాలు రాజకీయ కారణాలతో అడ్డుపడటం తగదు’’.

- లోక్‌సభ చర్చలో ఎంపీ పురందేశ్వరి