Share News

నారీ భేరి!

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:08 AM

చట్టసభల్లో మహిళల సంఖ్య భారీగా పెరగనుంది. వారి గళం కూడా మరింత బలంగా వినిపించనుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును కూడా పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే...

నారీ భేరి!

  • అటు నియోజకవర్గాల పునర్విభజన..

  • ఇటు 33శాతం మహిళా రిజర్వేషన్‌

  • ఏపీ నుంచి చట్టసభల్లో భారీగా

  • పెరగనున్న అతివల ప్రాతినిధ్యం

  • ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల్లో వారు 12ు

  • పునర్విభజన, కోటాతో 87 అసెంబ్లీ

  • స్థానాలు వారికే.. 13 లోక్‌సభ సీట్లు కూడా..

  • వారసురాళ్లపై దృష్టి పెట్టిన నేతలు

  • ఇళ్లలో ఏకంగా రాజకీయ శిక్షణకు శ్రీకారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి

చట్టసభల్లో మహిళల సంఖ్య భారీగా పెరగనుంది. వారి గళం కూడా మరింత బలంగా వినిపించనుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును కూడా పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదింపజేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉండడంతో.. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగబోతోంది. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలు ఇప్పుడున్న 175 నుంచి 263కి పెరుగనున్నాయి. వీటిలో మూడో వంతు అంటే.. ఏకంగా 87 సీట్లు మహిళకే వెళ్తాయి. దీంతో రాజకీయ ముఖచిత్రమే మారిపోనుంది. ఉద్దండులైన ఎందరో నేతలు తమ స్థానాల్లో తమ భార్యలనో.. కుమార్తెలనో.. కోడళ్లనో బరిలోకి దింపాల్సి రావచ్చు. మారనున్న రాజకీయ సమీకరణలను అంచనా వేసుకుంటూ చాలా మంది నేతలు ఇప్పటి నుంచే తమ ఇంట్లోని ఆడవాళ్లకు రాజకీయ శిక్షణను కూడా ప్రారంభించేశారు.


సీనియర్లకు కష్టకాలమే..!

ఇటీవల పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్‌.. ‘మహిళా రిజర్వేషన్‌ వస్తోంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండు’ అంటూ ఆమెనుద్దేశించి అన్నారు. ఈ వ్యా ఖ్యలు సరదాగా చేసినా భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో చాలా మంది యువతకు టీడీపీ పెద్దపీట వేసింది. రిజర్వేషన్‌తో మహిళల్లో యువతరం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లు తమ తర్వాతి తరాన్ని తెరపైకి తెచ్చేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధమవుతున్నారు.

ఏయే స్థానాలపై ప్రభావం..

మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను వారికి రిజర్వు చేసే పక్షంలో.. ప్రస్తుతం సుమారు 60 స్థానాల్లో వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇవి గానీ లేదా వీటిని విభజించి కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలు గానీ మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి.


కోస్తాలో..

మహిళా రిజర్వేషన్‌తో నేతలు ఎక్కువగా ఇబ్బంది పడే ప్రాంతం కోస్తా. ఇక్కడ సుమారు 22 స్థానాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వాటిలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సతీమణి భవాని ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 2024లో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తనకే సీటు తెచ్చుకున్నారు. అయితే 2029లో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ స్థా నం మహిళలకు రిజర్వ్‌ అయితే మళ్లీ భవాని తెరపైకి రావలసిందే. ఇక సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరి తన కుమార్తెను రంగంలోకి దించుతారన్న ప్రచారం ఉంది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌.. గన్నవరం, మైలవరం.. గుంటూరు పశ్చిమ, తూర్పు, తెనాలి, మాచర్ల, వినుకొండ.. ఒంగోలు.. నెల్లూరు రూరల్‌, కావలి, గూడూరు.. చింతలపూడి, భీమవ రం, పోలవరం.. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు, కొత్తపేట నియోజకవర్గాలు కూడా మహిళల కోటాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తెకు అవకాశం కల్పించాలని ప్రయత్నించినా ఆయన ససేమిరా అన్నారు. అలాగే దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌ వారసులకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నం జరిగినా కుదరలేదు. కర్నూలు, నంద్యాల, ఆలూరు, బనగానపల్లె, ఆదోని.. అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి, రాప్తాడు, తాడిపత్రి.. పలమనేరు, మదనపల్లె, శ్రీకాళహస్తి.. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ. గత ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరారెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. అలాగే కడపలో ీమాధవి పోటీ చేశారు. ఈసారి సీమ నుంచి మరింత మంది మహిళలు చట్టసభల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఉత్తరాంధ్రలో..

రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానం భీమిలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలితోపాటు పెందుర్తి, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం తూర్పు, పాయకరావుపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం స్థానాల్లోనూ మహిళా ఓటర్లు ఎక్కువే. వీటిలో శ్రీకాకుళం నుంచి గొండు శంకర్‌ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సతీమణి గొండు స్వాతి టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా చురుగ్గా ఉన్నారు. దీంతో మహిళా రిజర్వేషన్‌పై ఎలాంటి బెంగ లేదు. నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె బగ్గు అర్చన ఇప్పటికే రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నారు. అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీలకు పొందూరు ఎంపీపీగా సుదీర్ఘకాలం చేసిన అనుభవం ఉంది.

అసెంబ్లీలో ఇలా..

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 263కి పెరుగుతాయి. దీంతోపాటు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే 87 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారు. ప్రస్తుత సభలో ముగ్గురు మహిళా మంత్రులు సహా కేవలం 21 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

లోక్‌సభలో ఇలా..

లోక్‌సభలో సీట్ల సంఖ్య 543 నుంచి 816కి పెరిగే అవకాశం ఉంది. మహిళల వాటా ఏకంగా 273కి చేరుతుంది. ఆంధ్రలో ఇప్పుడు 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత అవి 37-38కి చేరతాయి. వాటిలో 12-13 స్థానాలు మహిళలవే.

Updated Date - Mar 30 , 2026 | 06:10 AM