Share News

న్యాయవ్యవస్థలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:47 AM

విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ సూచించారు.

న్యాయవ్యవస్థలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం

  • మార్గదర్శకులుగా నిలిచే లక్ష్యాలు పెట్టుకోవాలి

  • విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

  • హైకోర్టు సీజే జస్టిస్‌ లిసాగిల్‌ సూచన

సబ్బవరం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ సూచించారు. శనివారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆమె సందర్శించారు. విద్యార్థినుల కోసం నిర్మించిన వసతి గృహాన్ని, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన రెండు సమావేశ మందిరాలను ఆమె ప్రారంభించారు. వర్సిటీలో పలు విభాగాలను సందర్శించి, విద్యా భోదన జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండడంపై అభినందించారు. విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు సీజే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు. పంజాబ్‌-హరియాణా హైకోర్టులో ఇప్పుడు సుమారు 70 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారని, చాలా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో 65 శాతం వరకు మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. పరిస్థితి మారుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. నేటికీ ప్రతి రంగంలోనూ అడ్డంకులు ఉన్నప్పటికీ.. అది మన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను పరిమితం చేయకూడదని నిర్దేశించారు. ఇతరులకు మహిళలు మార్గదర్శకులుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. న్యాయ విద్యార్థులు మంచి సివిల్‌ సర్వెంట్లుగా మారగలరని, వారి న్యాయ పరిజ్ఞానం చట్టాన్ని సమర్థంగా అమలు చేయడంలో, శాంతి భద్రతలను కాపాడడంలో సహాయపడుతుందని చెప్పారు. వర్సిటీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆమెను ఉప కులపతి ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 04:49 AM