గుడివాడ అమర్నాథ్‌పై మహిళాగ్రహం
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:02 AM
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన దిష్టిబొమ్మకు చెప్పుల దండలు..
చిత్రపటంపై కోడిగుడ్లు, చెప్పు దెబ్బలు
వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
అమరావతి, ఆత్మకూరు, పి.గన్నవరం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అమర్నాథ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, ఆయన పోస్టర్లపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలియజేశారు. దళితురాలైన హోంమంత్రి అనితపై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలను మహిళా లోకంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. అమర్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు మహిళలు అమర్నాథ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ పి.గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళలు అమర్నాథ్ చిత్రపటాన్ని చెప్పులు, కోడిగుడ్లతోకొట్టి నిరసనతెలిపారు.
ఊరుకోం: రాయపాటి శైలజ
హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. ఒక మహిళా మంత్రిని మేకప్ మంత్రి అని సంబోధించడం అంటే.. ఆమెను మాత్రమే కాదు మహిళలందరినీ అవమానించినట్టేనని అన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు కమిషన్ వెనుకాడదని స్పష్టం చేశారు. అమర్నాథ్ వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అనితకు వైసీపీ క్షమాపణ చెప్పాలి
హోం మంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అవమానకరమైన, మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు వైసీపీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేశాయని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ మేరకు ‘వీ స్టాండ్ విత్ అనిత’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. తమ ఐదేళ్ల విధ్వంస పాలనపై ప్రజలకు సమాధానాలు చెప్పలేక వైసీపీ నేతలు చివరకు దూషణలు, బెదిరింపులు, మహిళా, కుల వివక్షతో కూడిన దాడులకు తెగబడుతున్నారని అన్నారు. మంత్రి అనిత సహా ప్రతి మహిళకు, ప్రతి దళితునికి వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ దిగజారుడు: డిప్యూటీ సీఎం పవన్
న్యూఢిల్లీ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో ఖండించారు. ‘మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేేస స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారు. ఆ వ్యాఖ్యలు కేవలం అనిత గురించి కాదు... సగటు మహిళలందరినీ కించపరిచినట్లే. ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలి. వాళ్ళు కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలి’ అని పేర్కొన్నారు.