Share News

9 దాటితే వీఐపీ బందోబస్తులో మహిళా సిబ్బంది వద్దు

ABN , Publish Date - May 07 , 2026 | 04:10 AM

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల తర్వాత సాగే వీఐపీ పర్యటనల్లో మహిళా సిబ్బందికి బందోబస్తు విధుల నుంచి ఉపశమనం కల్పించారు.

9 దాటితే వీఐపీ బందోబస్తులో మహిళా సిబ్బంది వద్దు

  • విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు

  • సీఎంవో ఆదేశాల మేరకు నిర్ణయం

  • కాన్వాయ్‌ నుంచి గమనించిన సీఎం

విజయవాడ, మే 6(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల తర్వాత సాగే వీఐపీ పర్యటనల్లో మహిళా సిబ్బందికి బందోబస్తు విధుల నుంచి ఉపశమనం కల్పించారు. బుధవారం నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అమరావతి నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ వెళ్లాలంటే పశ్చిమ బైపాస్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భవానీపురం, కొత్తపేట, నున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో పశ్చిమ బైపాస్‌ ఉంది. వీఐపీల రాకపోకల సమయంలో ఈ మూడు పీఎస్‌ల పరిధిలోని పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ మూడో తేదీ రాత్రి హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఉండవల్లి చేరుకున్నారు. సీఎం పర్యటన ఉండటంతో ఆయా స్టేషన్ల సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో నెలల శిశువు ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు బందోబస్తు విధులు కేటాయించారు. దీనిపై ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఉద్యోగం వదిలేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. కాన్వాయ్‌లో వెళ్తూ బైపా్‌సపై మహిళా సిబ్బంది విధుల్లో ఉండడాన్ని సీఎం చంద్రబాబు కూడా గమనించారు. వారి కష్టాలు తెలుసుకుని రాత్రిపూట బందోబస్తు విధుల నుంచి ఉపశమనం కలిగించాలని అధికారులను ఆదేశించారు. సీఎంవో ఆదేశాల మేరకు.. రాత్రి 9 దాటిన తర్వాత వీఐపీ బందోబస్తుకు మహిళా సిబ్బందిని ఉపయోగించవద్దని పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 07 , 2026 | 04:10 AM