మహిళా వీఆర్వోకు ఏడేళ్ల జైలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:14 AM
రైతుకు నష్టపరిహారం చెల్లించే ఫైలును ప్రాసెస్ చేయడానికి లంచం తీసుకున్న మహిళా వీఆర్వోకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధించారు.
లంచం కేసులో కర్నూలు ఏసీబీ కోర్టు తీర్పు
కర్నూలు లీగల్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రైతుకు నష్టపరిహారం చెల్లించే ఫైలును ప్రాసెస్ చేయడానికి లంచం తీసుకున్న మహిళా వీఆర్వోకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధించారు. కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎన్.శ్రీవిద్య మంగళవారం ఈ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ప్రభుత్వం చిలకలూరిపేట నుంచి కడపకు 765 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. వైఎ్‌సఆర్ కడప జిల్లా వల్లూరు మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డి పొలంలో కూడా పంట నష్టం జరిగింది. దీంతో మల్లికార్జున రెడ్డి వీఆర్వో చిత్రాల గంగమ్మను కలిసి ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నష్టపరిహారం గురించి వాకబు చేశారు. అయితే రైతుకు నష్టపరిహారం చెల్లించే ఫైలును ప్రాసెస్ చేసేందుకు ఆమె రూ.5 వేలు లంచం డిమాండ్ చే శారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని మల్లికార్జున రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 2018 ఫిబ్రవరి 20న చిత్రాల గంగమ్మ రూ.5వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కేసును విచారించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో గంగమ్మపై నేరం రుజువు కావడంతో వివిధ సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు, రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌భగవాన్ వాదించారు.