Share News

Anakapalli Hospital: సహజ ప్రసవంలో 4.8 కిలోల శిశువు జననం

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:00 AM

సహజ ప్రసవం ద్వారా ఓ మహిళ 4.8 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది.

Anakapalli Hospital: సహజ ప్రసవంలో 4.8 కిలోల శిశువు జననం

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): సహజ ప్రసవం ద్వారా ఓ మహిళ 4.8 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది.పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.రూపవతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మంగళవారం అర్ధరాత్రి అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయం (జిల్లా ఆస్పత్రి)లో చేర్పించారు. ఆమెకు ఎనిమిదో నెలలో నిర్వహించిన స్కానింగ్‌లో శిశువు బరువు మూడు కిలోలున్నట్టు భావించారు. తొమ్మిది నెలలు నిండేసరికి శిశువు బరువు మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహజ ప్రసవం కానిపక్షంలో సిజేరియన్‌ చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రసవ సమయంలో శిశువు తల మామూలుగానే వచ్చినప్పటికీ భుజాలు బయటకురావడంలో సమస్య తలెత్తింది. దీంతో సిజేరియన్‌ తప్పదేమోనని వైద్యులు భావించారు. అయితే వైద్యులు సౌజన్య, మానస, స్టాఫ్‌నర్సులు జగదీశ్వరి, జె.కుమారి, ఏఎన్‌ఎం సరస్వతి సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి సహజ ప్రసవం జరిగేలా చూశారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సెకండరీ ఆస్పత్రుల్లో ఇలాంటివి జరగడం చాలా అరుదని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ చక్రధరబాబు తెలిపారు.

సహజ ప్రసవాలు పెరగాలి: మంత్రి సత్యకుమార్‌

సహజ ప్రసవం అయ్యేందుకు అనకాపల్లి జిల్లా ఆస్పత్రి సిబ్బంది తీసుకున్న చొరవను వైద్య ఆరోగ్య సత్యకుమార్‌ యాదవ్‌ అభినందించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటువంటి చొరవ ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.

Updated Date - Jan 01 , 2026 | 06:01 AM