Share News

పుట్టింటికి వస్తే పట్టించుకోలేదని..

ABN , Publish Date - Mar 15 , 2026 | 03:55 AM

పుట్టింటికి వస్తే తల్లి తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్న ఆవేదనతో.. క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

పుట్టింటికి వస్తే పట్టించుకోలేదని..

  • ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

  • అనారోగ్యం, క్షణికావేశంతో అఘాయిత్యం

కర్నూలు క్రైం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పుట్టింటికి వస్తే తల్లి తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్న ఆవేదనతో.. క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం గార్గేయపురానికి చెందిన నాగమణి కూతురు రాజేశ్వరికి తెలంగాణలోని అలంపూర్‌కు చెందిన రాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారులు సుకుమార్‌, అబ్రహం ఉన్నారు. రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌. రాజేశ్వరి కంటి సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ మూడు రోజుల క్రితం అలంపూర్‌ నుంచి గార్గేయపురంలో పుట్టింటికి వచ్చింది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన తల్లి స్వీపర్‌గా పని చేస్తున్నందున, శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్దామని రాజేశ్వరి అడిగింది. శనివారం ఉదయం తీసుకెళ్తానని తల్లి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వరి.. తన భర్త దగ్గరే చూపించుకుంటానని చెప్పి శుక్రవారం ఉదయం 9.30 సమయంలో ఇద్దరు పిల్లలనూ తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నాగమణి తన అల్లుడు రాజుకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. రాత్రి మరోసారి ఫోన్‌ చేయగా.. రాజేశ్వరి ఇంతవరకు ఇంటికి రాలేదని రాజు చెప్పాడు. దీంతో నాగమణి ఆందోళనతో శనివారం ఉదయాన్నే గ్రామంలో గాలిస్తూ ఓ చెరువు వద్దకు వెళ్లి వెతికింది. అక్కడ తన కూతురి చెప్పులు, ఆధార్‌ కార్డు కనిపించాయి. స్థానికుల సాయంతో జాలర్లను పిలిపించి చెరువులో గాలించగా రాజేశ్వరి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్యం కారణంగా తన కూతురు క్షణికావేశంలో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - Mar 15 , 2026 | 03:55 AM