Share News

తప్పుల్లేకుండా..

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:23 AM

తప్పుల్లేని పాస్‌ పుస్తకాలు అందించేందుకు డ్రాప్ట్‌ పాస్‌బుక్స్‌ రూపకల్పనలో ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ఫొటోతో ఇచ్చిన పాస్‌ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో పాస్‌ పుస్తకాలు తప్పులు తడకలుగా వచ్చాయి. రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను అందించినా.. తప్పులు రావటంతో విమర్శలు వచ్చాయి. తప్పులు లేకుండా పాస్‌పుస్తకాలను ఇవ్వటం కోసం.. డ్రాప్ట్‌ పాస్‌పుస్తకాల జారీకి ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది.

తప్పుల్లేకుండా..

- ఎన్టీఆర్‌ జిల్లాలో డ్రాప్ట్‌ పాస్‌ పుస్తకాలకు శ్రీకారం!

- ముందుకు రైతులకు వారి వివరాలతో పేపర్‌ డ్రాప్ట్‌ అందజేత

- అభ్యంతరాల స్వీకరణ అనంతరం ముద్రణకు పాస్‌పుస్తకాలు

- నూరుశాతం తప్పులు లేకుండా అందించేందుకు ప్రయత్నం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

తప్పుల్లేని పాస్‌ పుస్తకాలు అందించేందుకు డ్రాప్ట్‌ పాస్‌బుక్స్‌ రూపకల్పనలో ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ఫొటోతో ఇచ్చిన పాస్‌ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో పాస్‌ పుస్తకాలు తప్పులు తడకలుగా వచ్చాయి. రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను అందించినా.. తప్పులు రావటంతో విమర్శలు వచ్చాయి. తప్పులు లేకుండా పాస్‌పుస్తకాలను ఇవ్వటం కోసం.. డ్రాప్ట్‌ పాస్‌పుస్తకాల జారీకి ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. డ్రాప్ట్‌ పాస్‌ పుస్తకాలలో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, ఇతర వివరాలు, కొలతలు, విస్తీర్ణం వంటివి ఉంటాయి. వీటితో కూడిన పేపర్‌ను ముందుగా రైతుకు ఇస్తారు. రైతు వీటిని చూసుకుని అన్నీ బాగుంటే బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్టుగా ఉన్నాయని బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఇస్తే .. వెంటనే ఒరిజినల్‌ పాసుపుస్తకాల ముద్రణకు పంపిస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే.. వారు లేవనెత్తిన అంశాలను రికార్డులతో సరిపోల్చుకుని.. సరిచేసిన తర్వాత ముద్రణకు పంపిస్తారు. దీనివల్ల రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ ఎలాంటి తప్పులు లేకుండా.. అక్షర దోషాలు లేకుండా ఖచ్చితత్వంతో ఉంటాయి. ఈ ప్రయోగాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో ముందుగా చేపట్టారు. ఈ ప్రక్రియ పట్ల క్షేత్ర స్థాయిలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 32 వేల మంది రైతులు

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 వేల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ఫొటోతో కూడిన పాస్‌ పుస్తకాలను ఇచ్చారు. తమ భూములకు చెందిన హక్కు పత్రాలపై జగన్‌ ఫొటోలు ఉండటంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను ఇవ్వటం ప్రారంభమైంది. ఈ క్రమంలో రెవెన్యూశాఖ క్షేత్ర స్థాయిలో టార్గెట్లు పెట్టడం కొంపముంచింది. ఐదు రోజులలో పాస్‌బుక్‌ల జారీకి శ్రీకారం చుట్టడమన్నది ఇబ్బందిగా మారింది. ఎందుకంటే స్థానికంగా భూములు ఉన్నప్పటికీ వీరిలో కొందరు.. ఇతర ప్రాంతాలలో కూడా ఉంటారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, విదేశాలలో ఉండే వారు కూడా ఉన్నారు. వీరితో కాంటాక్ట్‌ అవటంతో పాటు.. వారి వివరాలను తెలుసుకోవాలంటే ఐదు రోజుల సమయం సరిపోలేదు. పాస్‌బుక్‌ల కోసం పనిచేస్తున్న సిబ్బందిపై ఇతర బాధ్యతలు అప్పగించటంతో.. పని ఒత్తిడి, టార్గెట్లను భరించలేక.. సరిగా చూడకుండా పాస్‌ బుక్‌ జారీకి సిఫార్సులు చేశారు. దీంతో పాస్‌బుక్‌లు తప్పుల తడకలుగా వచ్చాయి. తొలి దశలో ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 4,500 పాస్‌పుస్తకాలు వచ్చాయి. వీటిలో తప్పులుండటంతో.. రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రానున్న రోజుల్లో కొత్తగా జారీ చేసే పాస్‌ పుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండటానికి డ్రాప్ట్‌ పాస్‌బుక్స్‌ విధానాన్ని తీసుకురావటం సత్ఫలితాలను ఇస్తోంది.

Updated Date - Feb 25 , 2026 | 01:23 AM