Share News

ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా చిత్రీకరిస్తారా?

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:51 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రసంగించే సమయంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో చేసిన పోస్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు

ప్రజల ఉత్సాహాన్ని   ఆగ్రహంగా చిత్రీకరిస్తారా?
CHANDRABABUNAIDU

  • ప్రజల నుంచి మీరెంత దూరమైపోయారో చెప్పడానికి ఇదే నిదర్శనం

  • జైరాం రమేశ్‌ పోస్టుపై సీఎం చంద్రబాబు కౌంటర్‌

  • నకిలీ వార్తలు సృష్టించడం సరికాదన్న లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రసంగించే సమయంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో చేసిన పోస్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జైరాం జీ.. అక్కడ జరిగిన ఘటనపై మీ పోస్టు వాస్తవానికి ఆమడ దూరంలో ఉంది. ప్రజల్లో వ్యక్తమైన ఉత్సాహాన్ని, విశేష స్పందనను.. మీరు ఉద్దేశపూర్వకంగా ప్రజాగ్రహంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సభకు హాజరైన వారి అత్యుత్సాహం వల్ల కార్యక్రమానికి స్వల్ప అంతరాయం కూడా ఏర్పడకూడదనే ఉద్దేశంతో నేను కొద్దిపాటి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా భ్రమపడటం చూస్తుంటే ఏపీ ప్రజల మనోభావాలతోపాటు దేశప్రజల నాడిని పసిగట్టడంలో మీరు ఎంతగా విఫలమయ్యారో స్పష్టమవుతోంది. రాజకీయ దురుద్దేశంతో సృష్టించే తప్పుడు ప్రచారాలు.. ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించిన, వ్యక్తం చేసిన భావాలను ఎప్పటికీ మార్చలేవు’ అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.


lokesh.jpgమదనపల్లె సభలో ఏం జరిగిందంటే..

మదనపల్లె సభలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతున్నప్పుడు సభకు హాజరైన వారి నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు జై అనే నినాదాలు హోరెత్తాయి. దీంతో నిర్మల కాసేపు మౌనంగా ఉండాలని కోరినా నినాదాలు కొనసాగాయి. చంద్రబాబు జోక్యం చేసుకుని వారిని శాంతపరిచారు. అనంతరం సభ యథావిధిగా కొనసాగింది.

వాస్తవాలు ధ్రువీకరించుకోవాలి: లోకేశ్‌

మదనపల్లి సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారని చేస్తున్న ప్రచారాన్ని మంత్రి లోకేశ్‌ ఖండించారు. ఇది పూర్తిగా నకిలీ వార్తఅని స్పష్టం చేశారు. దీనిపై ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు కావాలని స్థానిక యువత ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారనే వార్తలో నిజం లేదు. జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. ఉత్సాహంగా హాజరైన ప్రజలతో జరిగిన సాధారణ సంభాషణలో ఉద్దేశపూర్వకంగా కొంతభాగాన్ని తీసుకుని, దాన్ని వక్రీకరించి కల్పిత కథ అల్లారు. జైరామ్‌ రమేశ్‌ లాంటి సీనియర్‌ నాయకుడు ట్వీట్‌ చేసే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 07:01 AM