DRDA Former PD Sainath: అర్ధ నగ్నంగా నిరసనకు దిగుతా
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:58 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సెర్ప్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.సాయినాథ్ జయచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీఆర్వో కె.మాధవి ఉత్తర్వులు జారీచేశారు.
ఎస్టీ ఉద్యోగిని కావడం వల్లే నాపై వేధింపులు
కోనసీమ డీఆర్డీఏ పీడీగా చేసిన సాయినాథ్
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఇటీవల డీఆర్వో ఉత్తర్వులు
అమలాపురం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సెర్ప్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.సాయినాథ్ జయచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీఆర్వో కె.మాధవి ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సాయినాథ్ అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, ముందస్తు సమాచారం లేకుండా ఎక్కువ రోజులు సెలవుల్లో ఉండడంతో పాటు షెడ్యూల్ చేయబడిన సమావేశాలకు గైర్హాజరు కావడం వంటి కారణాలతో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. పాలనా ప్రయోజనాల దృష్ట్యా తదుపరి చర్యల కోసం సాయినాథ్‌ను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవోకు సరెండర్ చేశారు. దీనిపై సాయినాథ్ జయచంద్ర ఆదివారం అమలాపురంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎస్టీని అయినందు వల్లే తనను అకారణంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో పలువురు ప్రముఖుల వద్ద పనిచేసి ప్రశంసలు అందుకున్న చరిత్ర తనదన్నారు. కారణాలు చూపకుండా సరెండర్ చేయడం ఏంటని పరోక్షంగా కలెక్టర్‌ను నిలదీశారు. తనకు జరిగిన అన్యాయంపై అమలాపురంలో అర్ధనగ్నంగా కూర్చుని, నిరసన తెలియచేస్తానని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే జిల్లాలోని పలువురు దళిత ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పనిచేసే వాళ్లనే పంపిస్తారా..! అంటూ వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై మాల, మాదిగ, గిరిజన, లంబాడీలతో సహా అనేక జాతులకు చెందిన వారితో కలసి ఉద్యమిస్తానన్నారు.