కృష్ణా బోర్డు అమరావతికి వచ్చేనా?
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:19 AM
రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావస్తోంది. అయినా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) హైదరాబాద్‌లోనూ ఉండాలి.
జగన్ హయాంలో విశాఖకు తరలించే యత్నం
ఆంధ్రా వర్సిటీ ఆవరణలో భవనాలు కేటాయింపు
సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిలిచిన ప్రక్రియ
ఇప్పటికీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే..
తరలింపు పట్టనట్టు వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావస్తోంది. అయినా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) హైదరాబాద్‌లోనూ ఉండాలి. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే అంటే.. 2014లోనే కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతి లేదా విజయవాడలో ఏర్పాటు చేయాలి. కానీ తొలి ఐదేళ్లూ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. కేఆర్‌ఎంబీ చైర్మన్ సహా పలువురు ఇంజనీరింగ్ అధికారులు విజయవాడ రావడానికి ఆసక్తి చూలేదు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీకి చెందిన ఇంజనీరింగ్ అధికారులు సైతం బోర్డును తరలించడంలో ఎంత జాప్యమైతే అంత మంచిదని భావించారు. మరోవైపు విభజన అనంతరం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగాయి. రెండు బోర్డులూ హైదరాబాద్‌లోనే ఉండటంతో నదీ జలాలు ఎక్కువగా వాడేస్తున్నామని, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టేస్తున్నామని తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఏపీపై తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర జల వనరుల ఉన్నతాధికారులు ప్రతిసారీ హైదరాబాద్ వెళ్లి ఆయా బోర్డుల ముందు వివరణలు ఇచ్చి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనే యాజమాన్య బోర్డులు ఉండాలి. కానీ గత వైసీపీ ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంతో సంబంధం లేని విశాఖపట్నంలో కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇరిగేషన్ కార్యాలయ భవనాలు కేటాయించింది. ఈ ప్రతిపాదనకు కేఆర్‌ఎంబీ కూడా అంగీకరించింది. అయితే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత రైతాంగం, సాగునీటి ప్రాజెక్టుల వినియోగదారులు, ఇంజనీరింగ్ అధికారులు దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈలోపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో బోర్డు తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. నాటినుంచీ కేఆర్‌ఎంబీ హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. దీనిని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు జరగకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం ఏపీలో ఉంటేనే కృష్ణానదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను కాపాడుకోవడం సాధ్యమని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి న్యాయం చేసేలా కృష్ణా బోర్డును అమరావతికి తరలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.