Share News

జీడీపీకి మోక్షం లభించేనా..?

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:09 PM

గాజులదిన్నె.. కరువు, వలసలకు నిలయమైన పశ్చిమ ప్రాంతంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు. వైసీపీ హయాంలో జలాశయం సామర్థ్యం 5.50 టీఎంసీలకు పెంపు, పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు.

జీడీపీకి మోక్షం లభించేనా..?
అసంపూర్తిగా గాజులదిన్నె ప్రాజెక్టు గేటు

ఆగిపోయిన జలాశయం ‘సామర్థ్యం పెంపు’ పనులు

వైసీపీ హయాంలో బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

పూర్తి చేయాలంటే రూ.92 కోట్లు అవసరం

బడ్జెట్‌లో రూ.11.61 కోట్లు మాత్రమే కేటాయింపు

రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే

కర్నూలు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె.. కరువు, వలసలకు నిలయమైన పశ్చిమ ప్రాంతంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు. వైసీపీ హయాంలో జలాశయం సామర్థ్యం 5.50 టీఎంసీలకు పెంపు, పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు. బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్‌ చేతులెత్తేయమే కాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పనులు మొదలవుతాయని ఆశిస్తే.. రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా చర్యలు శూన్యం. అసంపూర్తి పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.92 కోట్లు అవసరం. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బకాయి రూ.27 కోట్లు.. మరో రెండు గేట్లు ఏర్పాటు అత్యవసరం ఉంది. ఏపీ బడ్జెట్‌-2026-27 కేటాయింపులు కేవలం రూ.11.61 కోట్లు మాత్రమే. ఇలాగైతే అసంపూర్తి పనులు పూర్తయ్యేదెన్నడో..? ఐదు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకు? రైతులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.

జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రాణాధారం గాజులదిన్నె జలాశయం (సంజీవయ్య సాగర్‌). 4.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా గోనేగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పరిధిలోని 21 గ్రామాలకు 25,454 ఎకరాలు రబీ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. అదే క్రమంలో డోన, కృష్ణగిరి, బండగట్టు తాగునీటి పథకాలు ద్వారా డోన పట్టణంతో పాటుగా వివిధ గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. వేసవిలో అత్యసరమైతే కర్నూలు నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తారు. ఎమ్మిగనూరు పట్టణానికి కూడా తాగునీటి సరఫరా కోసం పైపులైన పనులు చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె సమీపంలో హంద్రీ నదిపై ఈ ప్రాజెక్టు నిర్మించినా.. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, డోన, కర్నూలు నియోజకవర్గాల్లో సాగు, తాగునీరు అందించే ఏకైక ప్రాజెక్టు ఇది. జీడీపీ జలాశయం సామర్థ్యం 4.50 టీఎంటీల నుంచి 5.50 టీఎంసీలకు పెంపు పనులను భూ సేకరణతో కలిపి రూ.135 కోట్లు అంచనాతో గత వైసీపీ హయంలో పనులు చేపట్టారు. ఈ నిధులతో అదనంగా ఒక టీఎంసీ నిల్వ చేయడానికి మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు, శిథిలావస్థకు చేరుకున్న గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

నాడు.. నేడు నిర్లక్ష్యం:

జీడీపీ సామర్థ్యం పెంపు పనుల్లో నాడు వైసీపీ.. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. మట్టి ఆనకట్టకు ఒక మీటరు ఎత్తు పనులు రూ.35 కోట్లతో చేపట్టారు. మరో రూ.55 కోట్లతో ఆరు పాత గేట్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చే పనులకు శ్రీకారం చుట్టారు. భూ సేకరణతో కలిపి దాదాపు రూ.135 కోట్లు అంచనా వ్యయంతో గత ప్రభుత్వ హయాంలో పనులు మొదలు పెట్టారు. కాంట్రాక్టర్‌కు దాదాపు రూ.27 కోట్లు బకాయి బిల్లులు చెల్లించాలి. బిల్లులు ఇవ్వకపోవడంతో గతంలోనే పనులు ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయి బిల్లులు చెల్లించి పనులు మొదలు పెడుతారనుకుంటే ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. అయితే.. ఆరు గేట్లకు ఇనుప తాళ్లు (రోప్స్‌) తొలగించి కిందకు దింపేశారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో గతేడాది జూన, జూలై నెలల్లో ముందస్తు వర్షాలకు జలాశయానికి వరద మొదలైంది. డ్యాం నిండితే ఆనకట్టకే ప్రమాదం పొంచి ఉందని ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఉమ్మడి జిల్లాల ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా కాంట్రాక్టర్‌పై ఒత్తిడితెచ్చి ఐదు గేట్లు కొత్తగా ఏర్పాటు చేశారు. అసంపూర్తి ఆనకట్టు పనులు ఎక్కడికక్కడే వదిలేశారు.

అవసరం రూ.93 కోట్లు.. ఇచ్చింది రూ.11.61 కోట్లు:

ఇప్పటికే కాంట్రాక్టర్‌ రూ.57 కోట్లు విలువైన పనులు చేశారు. అందులో రూ.27 కోట్లు బిల్లులు బకాయి ఉంది. బకాయి బిల్లులు చెల్లింపు, అసంపూర్తి పనులకు, 627 ఎకరాల భూ సేకరణ కలిపి దాదాపు రూ.92 కోట్లు అవసరం ఉందని అంచనా వేశారు. ఇందులో రూ.40 కోట్లు ఇస్తే అసంపూర్తి పనులు, కొత్త గేట్లు ఏర్పాటు పూర్తి చేయవచ్చని ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ద్వారా జలవనరుల శాఖకు, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించారు. కేవలం రూ.11.61 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదే క్రమంలో బకాయి బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆరు నెలల్లోగా బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంటే.. అరకొర కేటాయింపు నిధులు కాంట్రాక్టర్‌ చెల్లించాల్సిన బకాయిలకే సరిపోవడం లేదు. అసంపూర్తి పనులకు మోక్షం లభిస్తుందా..? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

పనులు పూర్తి చేసేందుకు చర్యలు - పాండురంగయ్య, ఈఈ, టీబీపీ ఎల్లెల్సీ డివిజన, ఆదోని:

గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.27 కోట్లు బకాయి ఉన్న మాట నిజమే. ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఆరు నెలల్లో బిల్లులు చెల్లించాలని న్యాయ స్థానం ఆదేశించింది. బడ్జెట్‌లో రూ.11.61 కోట్లు కేటాయించారు. కొత్త గేట్ల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అదనపు నిధులు రాబట్టి అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Feb 18 , 2026 | 11:09 PM