Share News

కాల్వల నిర్వహణ పనులు సకాలంలో జరిగేనా!

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:09 AM

ఏటా కాల్వల నిర్వహణపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంటూనే ఉంది. ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల అంచనాలు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదానికి పంపారు. ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించింది. అయితే వాటితో ఏయే పనులు చేస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది మట్టి పనులు ఉన్నట్టా.. లేనట్టా అనే అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు.

కాల్వల నిర్వహణ పనులు సకాలంలో జరిగేనా!

- ప్రభుత్వ ఆమోదానికి పనుల అంచనాలు

- ఒక్కో నియోజకవర్గానికి రూ.3.50 కోట్ల కేటాయింపు

- మట్టిపనులు ఉన్నట్లా, లేనట్లా!

ఏటా కాల్వల నిర్వహణపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంటూనే ఉంది. ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల అంచనాలు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదానికి పంపారు. ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించింది. అయితే వాటితో ఏయే పనులు చేస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది మట్టి పనులు ఉన్నట్టా.. లేనట్టా అనే అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఖరీఫ్‌ సీజన్‌ మరో 45 రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్‌ నెల పంటల సాగుకు అనుకూలం. కాల్వలకు సాగునీటిని సకాలంలో విడుదల చేస్తే జూన్‌ రెండో వారం నుంచి రైతులు నారుమడులు పోస్తారు. ఈలోగానే పంటకాల్వలు, డ్రెయినేజీల నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు చేసేందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఓఅండ్‌ఎం పనులకు సంబంధించి అంచనాలను రూపొందించి నీటి పారుదల, డ్రెయినేజీ విభాగం అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఈ నెలాఖరు నాటికి ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు పరిపాలనా పరమైన అనుమతులు వస్తే మే, జూన్‌ నెలల్లో ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. శాసన సభ్యులకు ఈ ఏడాది కేటాయించే రూ.25 కోట్ల నుంచి కాల్వలు, డ్రెయినేజీల్లో కొంతమేర పనులు చేయించాలని రైతులు కోరుతున్నారు.

నియోజకవర్గానికి రూ.3.50 కోట్లు

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లాలోని పంట కాల్వలు, డ్రెయినేజీల్లో ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు అంచనాలు రూపొందించి, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. నిఽధుల కొరత కారణంగా కొన్ని పనులు చేసేందుకు అవకాశం లేదని కోతపెట్టారు. గతేడాది జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి ఓఅండ్‌ఎం పనులకు రూ.2కోట్ల చొప్పున కేటాయించారు. ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.3.50కోట్లకు పెంచారు. ఎన్ని పనులు చేయాల్సి ఉన్నా నియోజక వర్గానికి రూ.3.50 కోట్ల విలువైన పనులకు పరిమితం చేయాలనే ఆంక్షలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు పంట కాల్వలు, డ్రెయినేజీల్లో పూర్తిస్థాయిలో పనులు చేయలేదు. కాల్వల్లో ఈ ఏడాది అరకొరగా, అది కూడా గుర్రపుడెక్క, తూడు, నాచు, కిక్కిస తదితరాలను తొలగించేందుకు నిధులు విడుదల చేస్తారని సూచనప్రాయంగా చెబుతున్నారు. కొద్దిపాటి నిధులతో ఏ పనులకు అమోదం తెలుపుతారు, ఏయే పనులను నిలిపివేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఓఅండ్‌ఎం పనులకు సంబంధించి నిధుల విడుదలలో కోతపెట్టడంతో కాల్వగట్లు బలోపేతం చేసేందుకు, కాల్వలు పూడుకుపోయినచోట్ల పూడిక తీత పనులు చేసేందుకు నిఽధులు విడుదల చేయాలని సాగునీటి సంఘాల అధ్యక్షులు కోరుతున్నారు. 2025-26 ఆర్థికసంవత్సరంలో అన్నిరకాలకు చెందిన 666 పనులకు రూ.25.27కోట్లను కేటాయించారని, ఈ నిధులతో పూర్తిస్థాయిలో పనులు చేయలేకపోయామని సాగునీటి సంఘాల అఽధ్యక్షులు అంటున్నారు.

అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు అంటూ చర్చ!

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా నియోజకవర్గాల్లో కీలకమైన అభివృద్ధి పనులు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.25 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నిధులను అత్యవసరమైన పనులు చేసేందుకు శాసన సభ్యులు వినియోగిస్తారని ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. రహదారులు, ఇతరత్రా అభివృద్ధి పనులతోపాటు, పంట కాల్వలు, డ్రెయినేజీల్లో పూడికతీత పనులకు నిధులను ఎంతమేర కేటాయిస్తారనే అంశంపై నియోజకవర్గ రైతుల్లో చర్చ జరుగుతోంది. డ్రెయినేజీల్లో సక్రమంగా పూడికత తీయకపోవడంతో గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన మొంథా, దిత్వా తుఫానుల వల్ల పొలాల్లోని నిల్వ ఉన్న నీరు సకాలంలో బయటకు పోక రైతులు పంటలు కోల్పోయారు. ఈ ఏడాది డ్రెయినేజీల్లో పంట కాల్వగట్ల బలోపేతం, అవసరమైనచోట్ల పూడికతీత వంటి పనులను చేసేందుకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

అంచనాల్లోనే అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు, నాగాయలంక మండలాల్లోని ఏడు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లకు మరమ్మతులు చేసేందుకు రూ.30.44 కోట్లతో అంచనాలు రూపొందించినా, నిధులు మాత్రం విడుదల కావడంలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గానికి వచ్చే రూ.25 కోట్ల నిధులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లకు కేటాయిస్తారనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరుగుతోంది. జిల్లాలో సగభాగానికి సంబంధించి మురుగు నీరు మచిలీపట్నం నియోజకవర్గంలోని డ్రెయినేజీల నుంచే సముద్రంలో కలుస్తుంది. ఈ నియోజకవర్గంలో డ్రెయినేజీల్లో రూ.13.25 కోట్లతో 74 పనులు చేసేందుకు అంచనాలు రూపొందించారు. ఈ పనులకు నిధులు ఎంతమేర, ఎప్పటికి విడుదల చేస్తారనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో పాటు మచిలీపట్నం సౌత మండలంలోని 14 గ్రామాల్లో మురుగునీటిని సముద్రంలో కలిపే మూడు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు ఉన్నాయి. సముద్రపు కరకట్ట వెంబడి కోన, కొత్తపల్లెతుమ్మలపాలెం వద్ద ఉన్న అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోయాయి. వీటికి ఈ ఏడాది ఎంతమేర మరమ్మతులు చేస్తారనే ది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Apr 20 , 2026 | 01:09 AM