Share News

బాబోయ్‌ పులి...

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:46 AM

ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ఆదివాసీలు, ఏజెన్సీ ప్రజానీకం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

బాబోయ్‌ పులి...

  • ఒకేరోజు ఐదు ఆవులను చంపిన వైనం

బుట్టాయగూడెం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ఆదివాసీలు, ఏజెన్సీ ప్రజానీకం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఒక్క రోజులోనే ఐదు ఆవులను పులి పొట్టన పెట్టుకుంది. బుధవారం జిల్లా ఏజెన్సీలో ప్రవేశించిన పులి గురువారం తెల్లవారేసరికి మూడు ఆవులను చంపేసింది. అం దులో ఒక చూడి ఆవు ఉంది. గురువారం ఉదయం బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చయ్యకు చెందిన ఆవు, నాగులగూడేనికి చెందిన చోడెం సీతమ్మకు చెందిన రెండు ఆవుల (ఒకటి చూడిది)ను చంపేసింది. జిల్లా అటవీ శాఖ అధికారి సందీ్‌పరెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిగిలిన పశువులను వేరే ప్రాంతంలో కట్టివేయాలని సూచించారు. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో చోడెం సీతమ్మకే చెందిన మరో రెండు ఆవులను పులి చంపింది. సూరప్పవారిగూడేనికి చెందిన మునేంద్ర అనే వ్యక్తికి చెందిన పొగాకు తోటల్లో పనిచేస్తున్న పాలేరు బొల్లి శ్రీనివాసరెడ్డి మరికొందరు ఆవు అరుపులు విన్పించడంతో అక్కడకు వెళ్లారు. జామాయిల్‌ తోటలో ఆవును తింటున్న పులిని ప్రత్యక్షంగా చూసి భయంతో పరుగులు పెట్టి ఇళ్లకు చేరుకున్నారు. పులి కదలికల సమాచారం కోసం జంగారెడ్డిగూడెం, ములగలంపల్లి అటవీ శాఖ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్‌ రెడ్డి తెలిపారు. పులి జాడను తెలుసుకోడానికి పలుచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Jan 23 , 2026 | 05:15 AM