సీసీ కెమెరా పెడితే దొరికిపోతామని..!
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:19 AM
గుంటూరు జిల్లా దుగ్గ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలువూరులో ఈ నెల 18వ తేదీ రాత్రి ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు తేలింది.
పథకం ప్రకారమే భర్తను చంపేసింది
గుంటూరు, (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా దుగ్గ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలువూరులో ఈ నెల 18వ తేదీ రాత్రి ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు తేలింది. శివనాగరాజు హత్యకు ఆయన భార్య లక్ష్మీ మాధురి కొద్ది కాలం క్రితమే పథకం రూపొందించినట్లు వెల్లడైంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ మాధురికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు చెందిన గోపీతో వివాహేతర సంబంధం కొనసాగుతున్న విషయం భర్తకు తెలియడంతో కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి సీసీ కెమెరాలు పెట్టాలని తన స్నేహితుడిని శివనాగరాజు సంప్రదించాడు. ఇంటికి సీసీ కెమెరా పెడితే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతామని, అప్పుడు భర్త నుంచి తనకు ప్రమాదమని భావించిన భార్య, సాధ్యమైనంత త్వరగా భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. ప్రియుడు గోపీతో కలిసి పథక రచన చేసింది. ముందుగా, తన స్వగ్రామం కృష్ణాజిల్లాలోని అత్తమూరు కావడంతో, అక్కడ స్థానిక బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికి సర్ది చెప్పిన క్రమంలో.. పుట్టింటివారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయాలని ఆమె షరతు విధించి భర్తను అందుకు ఒప్పించింది.
ఈమేరకు పొలాన్ని తన పేరుతో రాయించుకున్న లక్ష్మీమాధురి, తర్వాత భర్త హత్యకు స్కెచ్ వేసింది. బలిష్టంగా ఉండే శివరాజును చంపడానికి మత్తుమాత్రలు ఇవ్వడమే మార్గమని భావించి, హైదరాబాదులో కారు ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్రియుడు గోపీని సంప్రదించింది. దీంతో అతడు సత్తెనపల్లిలో తనకు పరిచయం ఉన్న ఆర్‌ఎంపీతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. అతడి సూచన మేరకు ఆర్‌ఎంపీ వైద్యుడు సత్తెనపల్లిలో మత్తు బిళ్లలు కొనుగోలు చేశాడు. అనంతరం గోపీ, ఆర్‌ఎంపీ కలసి చిలువూరు వెళ్లి వాటిని లక్ష్మీ మాధురికి అందించారు. ఆమె బిర్యానీ వండి అందులో 20కి పైగా మత్తు బిళ్లలు కలపడంతో బిర్యానీ తిన్న భర్త మత్తులోకి జారుకున్నాడు. ఈ విషయయాన్ని లక్ష్మీ మాధురి వెంటనే గోపీకి తెలపడంతో అతడు ఆర్‌ఎంపీతో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. ముగ్గురూ కలిసి శివనాగరాజును హత్య చేశారు. అయితే సహజ మరణంగా చిత్రీకరించాలనుకున్న వారి పథకం బెడిసి కొట్టడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు లక్ష్మీమాధురితోపాటు, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.