Share News

వైవీని వదిలేస్తారా!?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:08 AM

దేవదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీకి సంబంధించి, అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికీ పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడు!

వైవీని వదిలేస్తారా!?

  • సంతకం సుబ్బారెడ్డిది.. శిక్ష సింఘాల్‌కు!

  • దేవదాయ చట్ట ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు

  • పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం

  • ఆదేశాల అమలే అధికారుల బాధ్యత

  • నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే

  • తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సంతకం

  • సడలింపే కల్తీకి మూల కారణమని తేల్చిన సిట్‌

  • కానీ.. సంతకం చేసిన వైవీపై చర్యలు ఏవీ?

మద్యం పాలసీ మార్చడమే నేరమని తేల్చి... నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది!

మరి... నెయ్యి టెండర్ల పాలసీని మార్చి, నెయ్యి పేరిట ‘రసాయన మిశ్రమం’ సరఫరాకు ఆస్కారం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది?

‘అవకాశముండీ అడ్డుకోలేకపోయారు’ అంటూ ఐఏఎస్‌ అధికారి సింఘాల్‌పై చర్యలకు సిఫారసు చేసిన సీబీఐ ‘సిట్‌’... ఆ తీర్మానంపై సంతకం చేసిన వైవీ సుబ్బారెడ్డిని మాత్రం ఎందుకు ఉపేక్షించింది?

వైవీ పీఏ చిన్న అప్పన్న ఖాతాలో కోట్లు పడ్డాయని, కల్తీ నెయ్యి సరఫరాలో ఆయన పాత్ర కీలకమని తేల్చిన ‘సిట్‌’... అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులెవరో ఎందుకు తేల్చలేదు?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీకి సంబంధించి, అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికీ పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడు! అవును.. టీటీడీ వ్యవహారాల్లో పాలకమండలి అధ్యక్షుడే సుప్రీం! ఈ కీలకమైన అంశం సీబీఐ దృష్టికి రాకపోవడం అతిపెద్ద విచిత్రం! కూటమి ప్రభుత్వం కూడా ‘సిట్‌’ సిఫారసు మేరకు ఈవో అనిల్‌ సింఘాల్‌పై బదిలీ వేటు వేసింది. కానీ, అసలు వైవీ సుబ్బారెడ్డి మాటేమిటని ప్రశ్నించడంలేదు. మౌలికమైన ఈ అంశాలను సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం విస్తుగొలుపుతోంది.


టీటీడీలో బోర్డు చైర్మన్‌ పాత్రే కీలకం...

తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అక్కడ పాలనా, నియంత్రణ అంతా ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ చట్టం-1987 ప్రకారం జరుగుతుంది. దేవదాయ చట్టంలో ‘టీటీడీ’ కోసం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్‌ 97బి ప్రకారం టీటీడీ పాలకమండలి(బోర్డు) అత్యంత శక్తిమంతమైనది. టీటీడీ పరిపాలన, పర్యవేక్షణ, నిర్ణయాలు, నియంత్రణ అంతా కమిటీ పరిధిలోనే ఉంటుందని ఈ నిబంధన చెబుతోంది. ముఖ్యంగా టీటీడీ లో అమలయ్యే విధాన నిర్ణయాలు, పాలసీ అంశాలన్నీ బోర్డే తీసుకొని అమలు చేసే అధికారాన్ని కట్టబెట్టింది. అందులోనూ... చైర్మన్‌దే కీలక పాత్ర. బోర్డు తీసుకునే తీర్మానాలపై అధ్యక్షుడి సంతకమే ఉంటుంది. టీటీడీలో బోర్డు, చైర్మన్‌ సూపర్‌ పవర్‌ అయితే అధికారులు ఏం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేవదాయ చట్టం-1987 ప్రకారం... అధికారులు కేవలం బోర్డుకు సహాయకారులే అని ఇదే చట్టంలోని సెక్షన్‌ 109 చెబుతోంది. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే ఆదేశాలను కార్యనిర్వహణాధికారి (ఈఓ), సంయుక్త కార్యనిర్వహణాధికారి (జేఈఓ), ఇతర అధికారులు పాటించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. దేవస్థానం కోసం బోర్డు తీసుకునే నిర్ణయాల్లో ఈఓ కేవలం సహాయకారిగానే ఉంటారు. బోర్డు నిర్ణయాలను అమలుచేసే బాధ్యత మాత్రమే ఈవోది. బోర్డు నిర్ణయాలపై తన అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పొచ్చు. కానీ, నిర్ణయాధికారం బోర్డుది, ముఖ్యంగా చైర్మన్‌దే!


నెయ్యి విషయంలో ఏం జరిగింది?

2019 ఏప్రిల్‌లో నెయ్యి సరఫరా నిబంధనలు కఠినతరం చేయాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు కమిటీ తన సిఫారసులు చేసింది. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది. పూర్తిస్థాయి కమిటీ ఏర్పడకపోవడంతో... ఈవోగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆ సిఫారసులను ఆమోదించారు. ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు ఏర్పడింది. 2020 ఫిబ్రవరిలో నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించాలని బోర్డులో ప్రతిపాదించి, దానిని ఆమోదించారు. దీనిపై సంతకం... వైవీ సుబ్బారెడ్డిదే. ఆ తర్వాత... టెండరు నిబంధనలను సడలిస్తూ మరో తీర్మానం చేశారు. దానిపైనా సంతకం సుబ్బారెడ్డిదే. నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు, కల్తీ నెయ్యికి నిబంధనల సడలింపే రాచమార్గం ఏర్పాటు చేసిందని సిట్‌ నిర్ధారించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోవడమే సింఘాల్‌ నేరమని తేల్చింది. కానీ... దేవదాయ చట్టం ప్రకారం టీటీడీలో అధికారులు నిమిత్త మాత్రులే! కల్తీ నెయ్యికి అసలు కారణం... టెండరు నిబంధనలను సడలిస్తూ వైవీ సుబ్బారెడ్డి సంతకం చేసిన తీర్మానమే! ఆయన సంతకాలున్న బోర్డు తీర్మానాలు, ఉత్తర్వుల అమలుకు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అంటే, కల్తీనెయ్యి కొనుగోళ్ల వెనక జరిగిన కుట్రకు తెరలేపింది, అక్రమం, అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించింది వైవీ సుబ్బారెడ్డే! మరి... సిట్‌ ఆయనను ఎందుకు వదిలేసింది? నేరం చేసిన వ్యక్తిని వదిలేసి, అందుకు సహకరించారన్న అభియోగాలపై అధికారులపై వేటువేయడం సబబేనా?


ప్రభుత్వ పాలనలో రూల్స్‌ వేరు...

దేవదాయ చట్టం-1987 ప్రకారం టీటీడీలో పాలకమండలే సుప్రీం. కానీ... ప్రభుత్వ పాలనలో జరిగే తప్పులకు అధికారులే బాధ్యులవుతారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానమైనా సరే... అది నిబంధనలకు విరుద్ధమైతే అధికారులు దానిని అడ్డుకోవాల్సిందే. కాదని అమలుచేసి క్యాబినెట్‌ మీదకు నెపం వేయడం చెల్లదు. మంత్రివర్గ నిర్ణయాలను తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తెప్పించుకుంటారు. తర్వాత వాటిని వాటిని ఆయా శాఖలకు పంపిస్తారు. ఆ తర్వాతే వాటిపై సంబంధిత కార్యదర్శులు ఉత్తర్వులు ఇస్తుంటారు. ఆ ఉత్తర్వులపై కార్యదర్శి సంతకాలే ఉంటాయి. ఇవి సచివాలయంలో అమల్లో ఉన్న పాలనా నిబంధనలు. కాబట్టి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు, అందుకు మూలమైన ఉత్తర్వు ఇచ్చిన అధికారి ఎవరో ముందు వారినే బాధ్యులను చేస్తారు.


సీబీఐ సిట్‌ది ఏ దారి?

టీటీడీ కల్తీ నెయ్యిలో సిట్‌ విచారణ... సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సీబీఐ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను ఎంపికచేసి సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం నెయ్యి కేసులో దర్యాప్తు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. అయితే... అసాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికీ ఒక నివేదికను అందించింది. అందులో సింఘాల్‌, ధర్మారెడ్డితోపాటు టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీని తప్పుపట్టింది. వారు తప్పు చేసినట్లు భావిస్తే... ఆ విషయాన్ని చార్జిషీట్‌లోనే ప్రస్తావించాల్సింది. కానీ... ఇలా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఎందుకు? సింఘాల్‌ పేరు చార్జిషీటులో పెడితే నిబంధనలు సడలిస్తూ తీర్మానంచేసిన వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా పెట్టాల్సి వస్తుందనే ఆగారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏర్పడిన ‘సిట్‌’లు... దర్యాప్తు చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేవి. కల్తీ నెయ్యిపై ఏర్పడిన సిట్‌ మాత్రం... అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 03 , 2026 | 06:14 AM