Share News

ఎవరికి దక్కేనో?

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:07 PM

ఆదోని మున్సిపల్‌ వైస్‌చైర్మన రేసులో పలువురు ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు.

  ఎవరికి దక్కేనో?
ఆదోని మునిసిపల్‌ కార్యాలయం

మున్సిపల్‌ వైస్‌ చైర్మన రేసులో పలువురు ఆశావహులు

23న ముసిన్సిపల్‌ కార్యాలయంలో ఎంపిక

ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు

ఆదోని టౌన, నవంబరు 9(ఆంధ్రజ్యోతి) : ఆదోని మున్సిపల్‌ వైస్‌చైర్మన రేసులో పలువురు ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు. ఈనెల 23న మునిసిపల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన ఎంపిక జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు వైస్‌ చైర్మన్లను ఎంపిక చేశారు. ఈసారి వైస్‌ చైర్మన ఒకరు ఉంటారా? లేక ఇద్దరిని ఎంపిక చేస్తారా? అన్నది ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. 12 సంవత్సరాల తరువాత మునిసిపల్‌ కౌన్సిల్‌ను కూటమి హస్తగతం చేసుకుంది. మొత్తం 52 మంది కౌన్సిలర్లకు గాను 30 మంది తెలుగుదేశం, 16 మంది వైసీపీ, ముగ్గురు బీజేపీ, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కోక్కరు అభ్యర్థులు విజయం సాధించారు. కౌన్సిల్‌కు వైస్‌ చైర్మనను ఎంపిక చేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి రావడంతో పలువురు ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన బింగి మనోహరయ్య జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రిని కలిసి అభ్యర్థించినట్లు తెలిసింది. గత కౌన్సిల్‌లో ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని వైస్‌ చైర్మన్లుగా ఎంపిక చేశారు. ఈనేపథ్యంలో ఒకవైపు ముస్లీం మైనార్టీలు, మరొక వైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులు ఈ సీటును ఆశీస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నియోజకవర్గం ఇనచార్జి మీనాక్షి నాయుడుకి సన్నిహితుడుగా ఉన్న తిమ్మప్పను వైస్‌ చైర్మనగా ఎంపిక చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతోపాటు పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యావంతుడు, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని వైస్‌చైర్మనగా ఎంపిక చేయాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:07 PM