లక్కు ఎవరికో?
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:09 AM
కర్నూలు నగర మేయర్.. 4.79 లక్షల ఓటర్లకు ప్రతినిధి. దీంతో మేయర్ పీఠంపై కీలక నాయకులు దృష్టి సారించారు.
కర్నూలు మేయర్ పీఠం రిజర్వేషనపై ఉత్కంఠ
ఎస్సీకి రిజర్వు చేసే అవకాశంపై విశ్లేషణలు
వైసీపీలోనూ తీవ్ర పోటీ
కర్నూలు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర మేయర్.. 4.79 లక్షల ఓటర్లకు ప్రతినిధి. దీంతో మేయర్ పీఠంపై కీలక నాయకులు దృష్టి సారించారు. ఎప్పుడు నోటిఫికేషన వచ్చినా పోటీకి సై అంటున్నారు. అయితే.. కీలమైన మేయర్ పీఠం ఏ సామాజికవర్గానికి రిజర్వు చేస్తారు..? ఇదే నగరంలో హాట్ టాపిక్. రిజర్వేషన ఎలా వచ్చినా.. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి టీజీ భరత ఇప్పటికే రంగంలోకి దిగారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, రిజర్వేషన్లు పరిశీలించి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అదే క్రమంలో ఓసీ జనరల్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంచనాలు వేస్తున్నారు. దీంతో మేయర్ బరిలో దిగేది ఎవరు..? పీఠం అధిష్ఠించేది ఎవరు..? ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ.
ఫ రిజర్వేషనపై ఎవరి అంచనాలు వారివి
అధికార కూటమి పార్టీల్లో టీడీపీకే మేయర్ పీఠం కేటాయించే అవకాశం ఉంది. అందులోనూ ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో పోటీకి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట ఎస్సీ జరనల్, ఆ తరువాత వరుసగా ఓసీ మహిళా, ఓసీ జనరల్‌కు కేటాయించారు. చివరిగా బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఈ లెక్కన రొటేషన పద్ధతి ప్రకారం రిజర్వేషన కేటాయిస్తే ఈసారి ఎస్సీకి రిజర్వు చేస్తారని అంచనా వేస్తున్నారు. బీసీ మహిళకు రిజర్వు చేసే అవకాశం ఉందని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత రిజర్వేషన లెక్కలను పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్ర విభజన తరువాత కర్నూలు కార్పొరేషనకు ఒకసారే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీసీకి రిజర్వు చేశారు. దీంతో ఓసీకి కేటాయించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఫ పోటీకి సై అంటున్న నేతలు
ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు చేస్తే సాయిబాబ సంజీవయ్య నగర్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు దివంగత బొల్లెద్దుల రామకృష్ణ కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆయన కుమారుడు బొల్లెద్దుల మహేశను బరిలో దింపే ఛాన్స ఎక్కువగా ఉంది. టీజీ వెంకటేశ కుటుంబంతో ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో బొల్లెద్దుల కుటుంబానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే.. మాజీ కార్పొరేటర్ గున్నమార్క్ కూడా ఆశలు పెట్టుకున్నారు. జనరల్‌కు కేటాయిస్తే, పోటీ తీవ్రంగా ఉంది. కర్నూలు నియోజకవర్గం నుంచి నిడ్జూరు కొండారెడ్డి రాంభూపాల్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన మంత్రి టీజీ భరతను కలసి తన మనసులోని మాటను చెప్పారని సమాచారం. జనరల్ కేటాయిస్తే మార్కెట్ యార్డు మాజీ చైర్మన పెరుగు పురుశోత్తంరెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ చౌదరి, కేవీఎస్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి కుమార్తె, మాజీ కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి ఆశిస్తున్నారు. బీసీకి రిజర్వు చేస్తే టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, మాజీ కార్పోరేటర్ పరమేశలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన పరిధిలోకి కోడుమూరు నియోజవర్గం నుంచి నాలుగు వార్డులు వస్తాయి. కేడీసీసీబీ చైర్మన విష్ణువర్దనరెడ్డి కూడా అభ్యర్థిని బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.
ఫ వైసీపీలో అభ్యర్థి కోసం అన్వేషణ!
కూటమి అధికారంలో ఉండడం, మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి టీజీ భరత రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడంతో వైసీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో మేయర్‌గా పోటీ చేసే అభ్యర్థి ఎంత తక్కువ కాదన్నా రూ.8-10 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతఖర్చు చేసి ఓడిపోతే ఆ తరువాత పరిస్థితి ఏమిటి? అన్న సందిగ్ధంలో ఆ పార్టీ కీలక నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఓడిపోయారు. జగన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, కలెక్టర్ ఉద్యోగం రెండు పోయాయి. వైసీపీలో వర్గపోరు వల్ల ఆయన రాజకీయాలకే దూరమయ్యారు. మేయర్‌గా పోటీ చేస్తే మా పరిస్థితి కూడా అదేకదా..? అంటూ పలువురు లోలోన మదనపడుతున్నారు. మేయర్ పీఠం ఎస్సీకి రిజర్వు అయితే మాజీ ఎమ్మెల్యే మణిగాంధి కోడలు ప్రత్యుశను బరిలో దింపవచ్చని అంటున్నారు. జనరల్‌కు కేటాయిస్తే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి భార్య ఎస్వీ విజయమనోహరి, మాజీ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక ఇద్దరిలో ఒకరు బరిలో ఉంటారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బీసీకి రిజర్వు చేస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుక లేదంటే ఆమె కుమారుడు బుట్టా ప్రతుల్‌ను బరిలో దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.