ఆక్వా రైతుపై మరో పిడుగు
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:32 AM
పెరిగిన దాణా ధరలు.. ఎగుమతులు లేక పడిపోయిన రొయ్యల ధరలతో సతమతమవుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. రొయ్యల చెరువులను వైట్ ఘట్ వ్యాధి చుట్టుముట్టింది.
(భీమవరం-ఆంధ్రజ్యోతి)
పెరిగిన దాణా ధరలు.. ఎగుమతులు లేక పడిపోయిన రొయ్యల ధరలతో సతమతమవుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. రొయ్యల చెరువులను వైట్ ఘట్ వ్యాధి చుట్టుముట్టింది. సీడ్‌లో నాణ్యత లేకపోవడం వల్లే ఇటువంటి వ్యాధులు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు మేతలో ఫిష్ ఆయిల్, సోయా శాతాన్ని తగ్గించినట్టు అనుమానిస్తున్నారు. నిన్నటి వరకూ మేత ధరలు తగ్గించాలంటూ ఆందోళనకు దిగిన రైతులు... ఇప్పుడు వైట్ ఘట్ వ్యాధితో రొయ్యసాగును గట్టెక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బెల్లంతో తయారు చేసిన మందులను వినియోగిస్తున్నారు. వైట్‌ఘట్ నివారణకు మందులు వాడటం కంటే.. పట్టుబడులు ఉత్తమమంటూ రైతులు చెరువులు ఖాళీ చేస్తున్నారు. సీడ్ వేసిన 40-50 రోజుల వ్యవధిలోనే వ్యాధి సోకవడంతో దిగుబడులు కూడా రావడం లేదు. మరోవైపు రొయ్య నాణ్యత తగ్గిపోతోంది. నాణ్యత లేని రొయ్యను లెక్కకట్టి రైతుకు ఇచ్చే ధరలో వ్యాపారులు కోత విధిస్తున్నారు. పది శాతం రొయ్య దెబ్బతింటే 100 కిలోలకు పది కిలోలు తగ్గించి మిగిలిన రొయ్యకు ధర చెల్లిస్తున్నారు.
ఆఫర్లకు పడిపోతున్న ఆక్వా రైతు
సీడ్ ఎంపికలోనే రైతులు దెబ్బతింటున్నారు. మొదటిసారి తల్లి రొయ్య నుంచి ఉత్పత్తి చేసే సీడ్‌కు అధిక ధర ఉంటోంది. రొయ్యపిల్ల 35 పైసల వరకు ఉంటుంది. కానీ అదే తల్లి రొయ్య నుంచి రెండు నుంచి నాలుగు పర్యాయాల వరకు సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. వన్ ప్లస్ వన్ ఆఫర్‌లో రొయ్య పిల్లల్ని రైతులు కొనుగోలు చేస్తుంటారు. ఏదైనా వైరస్ సోకి చెరువు ఖాళీ అయిపోతే రైతులు హేచరీలపై ఫిర్యాదు చేయకుండా మిన్నకుండి పోతున్నారు. ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు చేస్తామని అధికారులు చెబుతున్నా.. రైతుల నుంచి స్పందన ఉండటం లేదు. మరోసారి రొయ్యపిల్ల లభ్యం కాదనే ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నారు. ఇదే వారిని ముంచుతోంది. ఈ ఏడాది నాణ్యమైన రొయ్య పిల్ల కొనుగోలు చేస్తామంటూ రైతులు అధిక ధర చెల్లించారు. అయినా వైట్‌ఘట్ రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీడ్ బాగోలేదని, మేతలో సోయా, ఫిష్ అయిల్ తగ్గిపోయిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.50వేలు నష్టం
ప్రస్తుతం 100 కౌంట్ దశలో రొయ్య సాగు ఉంది. దాదాపు 90శాతం చెరువుల్లో వ్యాధి సోకడంతో కొందరు రైతులు పట్టుబడులు చేసేస్తున్నారు. దీనివల్ల ఎకరాకు రూ.50వేలు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. నాసి రకం సీడ్.. వైట్‌ఘట్ వ్యాధికి ప్రధాన కారణమని ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భగవాన్‌రాజు తెలిపారు. దీనిని అరికట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం పరిధిలో హ్యాచరీలు అధికంగా ఉన్నాయి. అక్కడి నుంచే అంతా సీడ్ కొనుగోలు చేస్తున్నారు. రైతులు తాము ఎక్కడ కొనుగోలు చేశారో చెబితేనే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని ఎంపెడా అధికారులు ఇటీవల భీమవరంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమావేశంలో వెల్లడించారు. రైతులే ఆఫర్ ప్రలోభాలతో సీడ్ కొనుగోలు చేయడం, నాణ్యతపై దృష్టి సారించకపోవడమే వ్యాధులు, వైర్‌సకు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. వైట్‌ఘట్ వ్యాధి కట్టడి కానట్టయితే రానున్న వారం రోజుల వ్యవధిలో చెరువులన్నీ ఖాళీ అవుతాయని ఆందోళన చెందుతున్నారు.