Share News

చెరువులు నింపేదెన్నడు..?

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:22 PM

ఎల్‌నినో ప్రభావం వల్ల పశ్చిమ పల్లెసీమల్లో కరువు ఛాయలు కమ్మేశాయి. అనావృష్ఠి తీవ్ర జలసంక్షోభాన్ని సృష్టిస్తుంది.

   చెరువులు నింపేదెన్నడు..?
వానలు లేక ఎండిపోయిన తుగ్గలి మండలం రాతన చెరువు

ఎల్‌నినో వల్ల ఒట్టిపోయిన గ్రామీణ నీటి వనరులు

పశువులకు గుక్కెడు నీరు కరువు

కృష్ణా జలాలు ఎత్తిపోసి చెరువులను నింపాలని జలవనరుల శాఖ ఎస్‌ఈ లేఖ

హంద్రీ నీవా జలాల కోసం రైతుల ఎదురు చూపు

కర్నూలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల పశ్చిమ పల్లెసీమల్లో కరువు ఛాయలు కమ్మేశాయి. అనావృష్ఠి తీవ్ర జలసంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఊళ్లలోని చెరువులకు నీటిజాడ లేక ఒట్టిపోయాయి. హంద్రీనీవా నుంచి చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీర్చాలనే సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ‘హంద్రీనీవా నుంచి 74 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోతల పథకం’ చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని చెరువులను నింపడం లేదు. గ్రామాల నీటి అవసరాలు తీర్చే చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి కన్నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నా పాలకులకు ఎందుకు వినిపించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. పాలకులు, అధికారులు ఇకనైనా స్పందించాలి.. కృష్ణా జలాలతో 74 చెరువులు నింపి రైతులు, పశువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

రాయలసీమ జిల్లాల్లో నిత్యం వెంటాడుతున్న దుర్భిక్షం, కరువు నివారణ లక్ష్యంగా హంద్రీనీవా సజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం ఎగువన మల్యాల నుంచి 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనిమిది టీఎంసీలు వినియోగించుకొని నందికొట్కూరు, పాణ్యం, డోన, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. అందులో భాగంగానే డోన, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో చెరవులకు హంద్రీ నీవా కాల్వ నుంచి కృష్ణా జలాలు ఎత్తి పోసేందుకు 2018 అక్టోబరులో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ‘హంద్రీ నీవా కాలువ నుంచి 68 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి సాగు, తాగునీరు అందించే ఎత్తిపోతల పథకం’ నిర్మాణానికి రూ.224.31 కోట్లతో పనులు చేపట్టింది. 2019 మేలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యం చేసినా.. మరో ఆరు చెరువులు అదనంగా చేర్చి పనులు పూర్తి చేసి 2023 సెప్టెంబరులో హడావుడిగా ప్రారంభించారు. అప్పటికీ పలు చెరువులకు నీరు మళ్లించే పైపులైన పనులు అసంపూర్తిగా ఉంటే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులు పూర్తి చేశారు. రెండేళ్లుగా కృష్ణా జలాలతో చెరువులు నింపి రైతులకు జల ఊపిరి పోశారు. అయితే.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పల్లెసీమలు తల్లడిల్లుతున్నా.. చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫ ఈ ప్రాజెక్టు లక్ష్యం:

కృష్ణగిరి మండలం అలంకొండ, లక్కసాగరం సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాలువ 90 కి.మీల వద్ద పంప్‌హౌస్‌ నిర్మించారు. అక్కడి నుంచి కటారుకొండ వద్ద నిర్మించిన డెలివరీ పాయింట్‌కు రోజు 150 క్యూసెక్కులు ఎత్తిపోసి, డెలివరీ పాయింట్‌ నుంచి చెరువులకు నీటిని మళ్లించేలా మూడు గ్రావిటీ మెయిన పైపులైన్లు నిర్మించారు. హంద్రీ నీవా కాలువ నుంచి 1.24 టీఎంసీలు ఎత్తిపోసి డోన, పాణ్యం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 74 చెరువులు నింపి 10,130 ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలి. ముఖ్యంగా వేసవిలో పశువులకు తాగునీరు అందించి మూగజీవాలను సంరక్షించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెరువులు నింపడంతో పశువుల దాహం తీరడమే కాకుండా భూగర్భ జలాలు పెరగడం వల్ల బోరుబావుల కింద సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది.

ఫ ఎండుతున్న చెరువులు.. రైతుల గుండెకోత:

కర్నూలు జిల్లా పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 38, నంద్యాల జిల్లా డోన నియోజకవర్గంలో 36 చెరువుల కలిపి 74 చెరువులు నింపాల్సి ఉంది. వీటిని నింపితే దాదాపు 85 చెరువుల్లో నీటి ప్రయోజనాలు కలుగుతుంది. 1.20 టీఎంసీలు ఎత్తిపోస్తే, నిత్యం కరువు, దుర్భిక్ష పరిస్థితుల్లో తల్లడిల్లే మరో ఎడారిని తలపించే పశ్చిమ ప్రాంతంలో తాగునీరు అందుతుంది. అంతేకాకుండా పశువుల దాహం తీరుతుంది. తాగునీటి అవసరాల కోసం వీలైనన్ని చెరువులు నింపి.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీశైలం డ్యాంకు ఆశాజనకంగా వరద చేరడంతో ఎగువన మాల్యాల లిఫ్ట్‌ నుంచి ఈ నెల 7న హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు ఎత్తిపోసేందుకు పంపులు ఆన చేశారు. ప్రస్తుతం తొమ్మిది పంపులు ద్వారా 3,050 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. జిల్లా సరిహద్దులు దాటి కృష్ణా జలాలు సాగిపోతున్నాయి. కళ్ల ముందే జీవజలాలు తరలిపోతున్నా.. దాహం తీర్చలేని దైన్యపరిస్థితుల్లో పశ్చిమ ప్రాంతం పల్లె జనం కన్నీరు పెడుతున్నారు. చెరువులు నింపి ప్రజలకు, పశువులకు తాగునీరు అందించాలని కోరుతున్నారు.

ఫ చెరువులు నింపి కన్నీళ్లు తుడవండి:

ఎల్‌నినో ప్రభావం వల్ల చినుకు జాడ లేదు. వంకలు వాగులు ప్రవహించే వానలు పడకపోవడంతో చెరువుల్లో చుక్కనీరు చేరక ఎండిపోతున్నాయి. సాగునీటి మాట ఎలా ఉన్నా.. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోసి చెరువులు నింపాలని, తద్వారా మూగజీవాలకైనా తాగునీరు సమస్య లేకుండా చేయాలని ఆయా నియోజకవర్గాల రైతులు జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ శైలేశ్వర్‌కు విన్నవించారు. ఆయన రైతులు, పశువుల తాగునీటి ప్రయోజనాల దృష్ట్యా హంద్రీ నీవా నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని, 110 కిలో మీటర్లు వద్ద తూములు ఎత్తి గాజులదిన్నె ప్రాజెక్టుకు తాగునీరు ఇవ్వాలని హంద్రీ నీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌-1 ఎస్‌ఈ రాజనబాబుకు లేఖ రాశారు. అయితే.. ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. 74 చెరువులతో పాటు గాజులదిన్నె జలాశయంలో 4.50 టీఎంసీలు నింపితే రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తాగునీటికి ఇబ్బందులు లేకుండా కొంతవరకు భరోసా ఇవ్వవచ్చని సాగునీటి నిపుణులు అంటున్నారు.

ఫ మంత్రి కరుణించరా..!:

జిల్లా ఇనచార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సమీక్ష సమావేశాల్లో కలెక్టరు డాక్టర్‌ ఎ. సిరి సహా జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. పశ్చిమ ప్రాంతం పల్లెసీమల్లో కన్నీటి కష్టాలు కూడా ఆయనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతి రోజూ జలవనరుల శాఖ ఇంజనీర్లతో మంత్రి నిమ్మల టెలీ కాన్ఫరెన్స నిర్వహిస్తున్నారు. హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు ఎత్తిపోతలపై కూడా ఆయన ఇంజనీర్లతో చర్చిస్తున్నారు. అయితే.. జిల్లా సరిహద్దు దాటించి పక్క జిల్లాలు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు తీసుకెళ్లడంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ.. తాను ఇనచార్జి మంత్రిగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెరువులు, జలాశయాలు నింపడంపై చూపడం లేదనే ఆరోపణులు లేకపోలేదు. ఇప్పటికైనా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీ నీవా ఇంజనీర్లకే ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి 74 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఫ ప్రభుత్వం అనుమతి రాగానే చెరువులు నింపుతాం - రాజనబాబు, ఎస్‌ఈ, హంద్రీ నీవా ప్రాజెక్ట్‌ కర్నూలు సర్కిల్‌-1, కర్నూలు:

హంద్రీ నీవా కాలువ నుంచి డోన, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులు నింపాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే 74 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 12 , 2026 | 11:22 PM