డ్రెడ్జింగ్ పనుల ఊసేది?
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:58 AM
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన డ్రెడ్జింగ్ పనులు ఇప్పటివరకు ప్రారంభమేకాలేదు. పోర్టు నిర్మాణం కోసం తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను పక్కనపెట్టి డ్రెడ్జింగ్ చేయడానికి అదనంగా మరో రూ.1500 నుంచి రూ.1600 కోట్లు కావాలని రైట్స్‌సంస్థ ద్వారా ఏపీ మారీటైమ్‌కు బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పక్కపెట్టేశారని సమాచారం. డీపీఆర్‌లో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనే అంశంపై సదరు అధికారులు రైట్స్ సంస్థ ప్రతినిధులను నిలదీసి, ఆ ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పారని తెలిసింది. ఇప్పటి వరకు డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించకుంటే పోర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయనే ఆంశంపైన సర్వత్రా చర్చ నడుస్తోంది.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో కీలక పని పెండింగ్!
- 200 హెక్టార్లలో 46.61 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలని ప్రతిపాదన
- ఇందుకు అదనంగా రూ.1500 నుంచి రూ.1600 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు
- ఏపీ మారీటైమ్ బోర్డు వద్ద పెండింగ్‌లో ప్రతిపాదనల ఫైల్
- అదనపు నిధుల విడుదల ప్రభుత్వ పరిశీలనలో ఉందంటున్న అధికారులు
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన డ్రెడ్జింగ్ పనులు ఇప్పటివరకు ప్రారంభమేకాలేదు. పోర్టు నిర్మాణం కోసం తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను పక్కనపెట్టి డ్రెడ్జింగ్ చేయడానికి అదనంగా మరో రూ.1500 నుంచి రూ.1600 కోట్లు కావాలని రైట్స్‌సంస్థ ద్వారా ఏపీ మారీటైమ్‌కు బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పక్కపెట్టేశారని సమాచారం. డీపీఆర్‌లో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనే అంశంపై సదరు అధికారులు రైట్స్ సంస్థ ప్రతినిధులను నిలదీసి, ఆ ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పారని తెలిసింది. ఇప్పటి వరకు డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించకుంటే పోర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయనే ఆంశంపైన సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం పోర్టు పనులు 55శాతంపైగా పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నారు. 2025 డిసెంబరు నాటికి పోర్టు పనులను పూర్తి చేయాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో 2026 డిసెంబరు వరకు ఈ పనులను పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోర్టు నిర్మాణంలో కీలకమైనవి సౌత, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణాలు, సౌత బ్రేక్ వాటర్ నిర్మాణం 2,075 మీటర్లు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం 250 మీటర్లు ఉండగా, ఈ బ్రేక్ వాటర్‌ల నిర్మాణ పనులు ఒక కొలిక్కివచ్చాయి. పోర్టు నిర్మాణంలో మిగిలినది అత్యంత కీలకమైనది డ్రెడ్జింగ్ పని. 80 వేల టన్నుల సరుకుల సామర్థ్యంతో దిగుమతులు, ఎగుమతుల కోసం వచ్చే ఓడల రాకపోకలకు అంతరాయం లేకుండా, సముద్రపు ఒడ్డు నుంచి సముద్రంలోకి 12.8 కిలోమీటర్ల పొడవునా అప్రోచ్ చానల్‌ను తవ్వాలి. నార్త్, సౌత బ్రేక్ వాటర్‌ల మధ్య ఈ అప్రోచ్ చానల్ 450 మీటర్ల వెడల్పున ఉండాలని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఓడల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిత్యం కొనసాగేలా ఈ చానల్ 18 నుంచి 20 మీటర్లు లోతు ఉండేలా చూడాలి. కానీ ఈ అప్రోచ్ చానల్‌కు సంబంధించి డ్రెడ్జింగ్ పనులు జరగడంలేదు. ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పోర్టు పనులను పరిశీలించిన సమయంలో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచన చేశారు. విదేశాల నుంచి డ్రెడ్జింగ్ మిషన్‌ను తెచ్చి మచిలీపట్నం పోర్టులో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభిస్త్తామని అధికారులు చెబుతున్నా, ఎప్పటికి ఈ డ్రెడ్జిర్ మచిలీపట్నం వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. 46.61 క్యూబిక్ మీటర్ల మట్టిని ఎప్పటికి డ్రెడ్జింగ్ చేస్తారనే అంశంపై అనుమానాలు కలుగుతున్నాయి.
అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు
మచిలీపట్నం పోర్టు పనులను రైట్స్‌సంస్థ పర్యవేక్షణ చేస్తోంది. పోర్టు పనులను రూ.4 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించారు. పోర్టు పనులు పూర్తిచేయడంలో ఇప్పటికే ఏడాది ఆలస్యం జరిగింది. పోర్టులో డ్రెడ్జింగ్, ఇతరత్రా పనులు చేసేందుకు ప్రభుత్వం రూ.1500 నుంచి రూ.1600 కోట్ల అదనంగా విడుదల చేయాలని రైట్స్ సంస్థ అధికారులు ఐదారు నెలల క్రితం ప్రతిపాదనలు ఏపీ మారీటైమ్ బోర్డు అధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. పోర్టు పనులు ప్రారంభించే సమయంలో రూపొందించిన డీపీఆర్ ప్రకారమే పోర్టు నిర్మాణ పనుల అంచనాలు తయారు చేశారని, మళ్లీ ఇప్పడు ఇంత పెద్దమొత్తంలో నిధులు విడుదల చేయడం కుదరదని, ఆ ఖర్చు రైట్స్ సంస్థనే భరించాలని మారీటైమ్ బోర్టు ఉన్నతాధికారి తనదైన శైలిలో కటువుగానే చెప్పినట్లు తెలిసింది. పోర్టు వద్ద నాలుగు బెర్తుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ బెర్తుల వరకు ఓడలు రావాలంటే కనీసంగా 20 మీటర్ల లోతున మట్టిని డ్రెడ్డింగ్ చేయాలి. డ్రెడ్జింగ్ పని కీలకం కాగా, ఈ పని మాత్రం జరగడం లేదు. రెండు బ్రేక్ వాటర్‌ల మధ్య సముద్రంలో కొంత మేర డ్రెడ్జింగ్ పనులు చేసినా, సముద్రపు ఒడ్డు నుంచి బెర్తుల వరకు డ్రెడ్జింగ్ పనులు జరగడం లేదు. ఈ పనిని ఎప్పటికి ప్రారంభిస్తారు. ఎప్పటికి పూర్తిచేస్తారు, అదనంగా నిధులు విడుదల చేస్తారా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అదనపు నిధుల విడుదలపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని పోర్టు పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు.