మూడు రోడ్లకు మోక్షమెన్నడో?
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:17 PM
మండలంలోని మూడు ప్రధాన రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీని వలన పనులు ప్రారంభంకాలేదు. దీంతో ఆయా గ్రామాల గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
అధ్వానంగా బొర్రా గేటువలస, బగ్మారవలస, పులుసుమామిడి రహదారులు
పునర్నిర్మాణానికి రెండు నెలల క్రితం నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
టెండర్ల ప్రక్రియ పూర్తికాక మొదలుకాని పనులు
40 గ్రామాల గిరిజనులకు తప్పని అవస్థలు
అనంతగిరి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూడు ప్రధాన రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీని వలన పనులు ప్రారంభంకాలేదు. దీంతో ఆయా గ్రామాల గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
మండలంలోని బొర్రా గేటువలస- కోనాపురం, బగ్మారవలస- టోకూరు, పులుసుమామిడి- లుంగపర్తి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొర్రా గేటువలస- కోనాపురం రోడ్డు పదిహేన్నేళ్లుగా గోతులమయంగా ఉంది. బగ్మారవలస- టోకూరు రోడ్డయితే ఎనిమిదేళ్లుగా, పులుసుమామిడి- లుంగపర్తి రోడ్డు ఐదేళ్లుగా అధ్వానంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ మూడు రహదారుల మీదుగా రాకపోకలు సాగించే సుమారు 40 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు 5.5 కిలోమీటర్ల మేర రోడ్డు పునర్నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసింది. అలాగే పులుసుమామిడి నుంచి లుంగపర్తి వరకు 1.5 కిలోమీటర్లకు రూ.95 లక్షలు, బగ్మారవలస నుంచి టోకూరు వరకు కిలోమీటరు మేర రోడ్డు పునర్నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు నెలల క్రితం పరిపాలన ఆమోదం తెలిపింది. దీంతో తమ కష్టాలు తీరతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడం తో పనులు ప్రారంభంకాలేదు. మరో రెండు నెలల్లో వర్షాకాలం రానుండడంతో ఆ లోపే పనులు పూర్తి కావాలని, లేకపోతే ఆటంకాలు తప్పవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ప్రాజెక్ట్సు ఏఈ గణేశ్ వివరణ కోరగా ఆ మూడు రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, పరిపాలన ఆమోదం కూడా వచ్చిందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.