Share News

ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృత్యువాత

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:53 AM

సంతోషంగా పెళ్లి వేడుకకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అర్ధంతరంగా కన్నుమూశారు. వర్షంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.

ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృత్యువాత

  • ‘పశ్చిమ’లో రెండు వేర్వేరు ఘటనల్లో పెను విషాదం

  • అయితంపూడిలో కాలువలోకి దూసుకెళ్లిన కారు

  • నలుగురు దుర్మరణం.. ఒకరు గల్లంతు

  • వేండ్ర వద్ద కాలువలో స్నానానికి దిగిన మరో ఇద్దరు..

  • మృతుల్లో కోనసీమ, పార్వతీపురం వాసులు

ఇరగవరం, పాలకోడేరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సంతోషంగా పెళ్లి వేడుకకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అర్ధంతరంగా కన్నుమూశారు. వర్షంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా మరొకరు గల్లంతయ్యారు. మరో ఘటనలో సరదాగా కాలువలో స్నానానికి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఆచంట మండలం వల్లూరుతోటకు చెంది న మట్టా సంతోష్‌, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడు కు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్‌ (18), నాగిరెడ్డి దుస్వంత్‌సాయి (18), నాగబత్తుల తేజ సాయి సూర్య (19), చెరుకూరి రాజా రాంచరణ్‌ (16), వీరమల్లు సాయి వెంకట కిరణ్‌ (18) శనివారం రాత్రి పెరవలిలో జరిగిన స్నేహితుడి సోదరుని వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఇరగవరం మండలం ఓగిడిలో పెళ్లికొడుకు నివాసానికి వచ్చిన వీరంతా తిరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో ఇంటికి బయలుదేరారు. ఓగిడి నుంచి అయితంపూడి వెళ్లేదారిలో వర్షం కారణంగా మలుపును గమనించక పోవడంతో కారు అదుపుతప్పి పెరవలి-నరసాపురం మెయిన్‌ కాలువలోకి దూసుకెళ్లింది. మట్టా సంతోష్‌ను స్థానికులు రక్షించి బయటకు తీసుకువచ్చారు. మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు, రెవెన్యూ, ఫైర్‌ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి దుస్వంత్‌సాయి, లక్ష్మీభా ను వికాస్‌, వెంకట కిరణ్‌, తేజ సాయిసూర్య మృతదేహాలను వెలికితీశారు. చెరుకూరి రాజా రాంచరణ్‌ కోసం గాలిస్తున్నారు. వీరంతా నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు.


కాలువలో స్నానానికి దిగి..

రెండు రోజులపాటు సెలవులు కావడంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం పాలకోడేరు మండలం వేండ్ర జీఎండ్‌వీ కెనాల్‌ నుంచి విడువడిన అడవికోడు (సబ్‌ కెనాల్‌)లో స్నానం చేసేందుకు వెళ్లారు. పార్వతీపురానికి చెందిన శ్రేష్టి రాహుల్‌ (21) ముందుగా కాలువలోకి దిగి మునిగిపోయాడు. రాహుల్‌ను రక్షించేందుకు భీమవరానికి చెందిన స్నేహితుడు పెరుమాళకల సత్యభాస్కర విఘ్నేష్‌ (21) కాలువలోకి దిగాడు. ప్రవాహ వేగానికి అతడూ మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెంటనే వచ్చి కాలువలో గాలించి ఇద్దరు మృతదేహాలనూ వెలికితీశారు.

Updated Date - Aug 17 , 2026 | 04:55 AM