Share News

టీచర్‌ తిట్టాడని పగబట్టి..!

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:21 AM

ముగ్గురు విద్యార్థులు ఒకే కంచంలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అది చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు ‘ఇది తప్పురా’ అని మందలించారు.

టీచర్‌ తిట్టాడని పగబట్టి..!

  • ఇనుప రాడ్డుతో దాడి చేసిన విద్యార్థి

  • పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో ఘటన

పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ముగ్గురు విద్యార్థులు ఒకే కంచంలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అది చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు ‘ఇది తప్పురా’ అని మందలించారు. విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పెద్ద గలాటా జరిగింది. ఇది జరిగి ఏడాదిన్నరవుతోంది. అప్పటి నుంచి కక్ష కట్టిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిపై తాజాగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం వద్ద జరిగింది. వివరాలివీ.. పాలకొల్లు మండలం లంకలకోడేరు జడ్పీ హైస్కూల్‌లో గతేడాది ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఒకే కంచంలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా, వ్యాయామ ఉపాధ్యాయుడు కుక్కల రాజా వెంకట సురేశ్‌ గమనించి మందలించారు. దీనిపై హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ విద్యార్థి తల్లిదండ్రులు హైస్కూల్‌కు వచ్చి గొడవ చేశారు. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న ఆ విద్యార్థి, అప్పటి నుంచి టీచర్‌ సురేశ్‌పై కక్ష పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మరో టీచర్‌తో కలిసి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో విద్యార్థులను చేర్పించేందుకు బైక్‌పై వెళుతున్న సురేశ్‌ను భగ్గేశ్వరం వద్ద దారి కాచిన ఆ విద్యార్థి ఇనుప రాడ్డుతో తలపైన, చేతిపైన బలంగా కొట్టాడు. పీక మీద రాయితో దాడి చేశాడు. తోటి ఉపాధ్యాయుడు అడ్డుకోవడంతో ఆ విద్యార్థి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే 108లో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యం అందిస్తున్నారు. విద్యార్థిపై పాలకొల్లు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 23 , 2026 | 03:21 AM