Share News

తెల్లారితే చెల్లెలి పెళ్లి అనగా..!

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:03 AM

తెల్లారితే చెల్లెలి పెళ్లి.. ఆ ఇద్దరు అన్నలు.. ఎంతో సందడిగా.. సంతోషంగా.. కుటుంబ సభ్యులతో కలిసి వరుడి స్వగ్రామంలోని పెళ్లి మండపానికి ఆటోలో బయలుదేరారు.

తెల్లారితే చెల్లెలి పెళ్లి అనగా..!

  • పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన లారీ

  • పెళ్లి కుమార్తె ఇద్దరు అన్నలు, వదిన సహా నలుగురు దుర్మరణం

  • 8 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

  • మార్కాపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోరం

కంభం, జూలై 3(ఆంధ్రజ్యోతి): తెల్లారితే చెల్లెలి పెళ్లి.. ఆ ఇద్దరు అన్నలు.. ఎంతో సందడిగా.. సంతోషంగా.. కుటుంబ సభ్యులతో కలిసి వరుడి స్వగ్రామంలోని పెళ్లి మండపానికి ఆటోలో బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను, మరో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీక్దొఇ. 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో పెళ్లి కుమార్తె ఇద్దరు అన్నలు, ఒక వదిన సహా.. నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గురువారం అర్ధరాత్రి మార్కాపురం జిల్లా కంభంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గిద్దలూరు మండలం నల్లబండబజార్‌కు చెందిన ఆవుల వీరక్కకు కంభం పట్టణానికి చెందిన మండ్లా పాములేటికి శుక్రవారం ఉదయం కంభంలో వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి 10.30 గంటలకు పెండ్లికుమార్తెతో సహా పదిమంది ఆటోలో, మరో ఇద్దరు ద్విచక్రవాహనంపై 30 కిలోమీటర్ల దూరంలోని పెళ్లి మండపానికి బయలుదేరారు. రాత్రి ఒంటిగంట సమయంలో కంభం వై జంక్షన్‌ సమీపంలో హైవే పక్కన ఉన్న వినాయకుడి గుడి వద్దకు వచ్చి ఆగారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి పెళ్లికుమార్తెతోపాటు మరో ఇద్దరు కిందకు దిగారు. ఇంతలో మదనపల్లి నుంచి ఖమ్మం జిల్లాకు తవుడు లోడుతో వెళ్తున్న లారీ అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపక్కన ద్విచక్రవాహనం దిగి ఆటో వెనుక నిలుచున్న ఆవుల అంకాలు (21), ఆవుల నాగేశ్‌(18)లను తొక్కించుకుని, ఆటోను బలంగా ఢీకొనడంతో అంకాలు భార్య రామానుజమ్మ(19), నాగరాజు, మైసమ్మల ఏడాదిన్నర వయసున్న కుమార్తె నాగేశ్వరి అక్కడికక్కడే మృతిచెందారు.


ఆటోలో ఉన్న ఆవుల వీరమ్మ, ఆవుల ఓబులమ్మ, నల్లబోతుల సంజీవరాయుడు, మైసమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. పెళ్లికూతురు వీరక్కతోపాటు మరో నలుగురికి స్వల్పగాయాలు కాగా ఒంగోలు తరలించారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ప్రమాదంతో వివాహం ఆగిపోయింది. మృతిచెందిన అంకాలు, నాగేశ్‌ అన్నదమ్ములు. స్వయానా పెండ్లికుమార్తె అన్నలు. రామానుజమ్మ ఆమె వదిన. మరికొద్దిసేపట్లో పెళ్లిమండపం వద్దకు చేరుకుంటారనగా జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందడంతో వధూవరుల ఇరు గ్రామాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Updated Date - Jul 04 , 2026 | 05:04 AM