Share News

టిడ్కో కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ABN , Publish Date - May 10 , 2026 | 11:51 PM

టిడ్కో కాలనీ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాన్వి దేవేంద్రప్ప అన్నారు.

టిడ్కో కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న దేవేంద్రప్ప

రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప

ఆదోని, మే 10 (ఆంధ్రజ్యోతి): టిడ్కో కాలనీ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాన్వి దేవేంద్రప్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ బియ్యం సక్రమంగా అందడంలేదని, వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్యాస్‌ సిలిండర్ల సరఫరా లేదని, అత్యవసరమైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల కోసం పాఠశాలలు, ఆశావర్కర్ల సేవల కొరత వంటి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నింటినీ సావధానంగా విన్న దేవేంద్రప్ప లబ్ధిదారులకు భరోసా కల్పిస్తూ తక్షణమే కలెక్టర్‌ , ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం దేవేంద్రప్ప విలేకర్లతో మాట్లాడుతూ 2014 నుంచి 2019వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆదోనిలో సుమారు నాలుగు వేలు టిడ్కో ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేసేలోపే ప్రభుత్వం మారిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రంగులు వేయడానికి తప్పా మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని, పేదల ఇంటి కల నెరవేరాలని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లను పంపిణీ చేశారని తెలిపారు. త్వరలోనే టిడ్కో కాలనీలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 10 , 2026 | 11:51 PM