వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:31 PM
ఆదోని పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఆదోని పట్టణాభివృద్ధికి మాల్స్ కీలకం
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఘనంగా వీఆర్‌కే షాపింగ్ మాల్ ప్రారంభం
ఆదోని, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వీఆర్‌కే షాపింగ్ మాల్ శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఒక నగరం లేదా పట్టణంలో మాల్స్, వినోద కేంద్రాలు, మంచి రెస్టారెంట్లు ఉండడం వల్ల సమగ్రమైన ఎకో సిస్టం ఏర్పడుతుందన్నారు. ఇటువంటి వసతులు ఉన్నప్పుడే పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని తెలిపారు. ఆదోనికి గతంలో ఉన్న సెకండ్ బొంబాయిగా గుర్తింపును పునఃరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీఆర్‌కే మాల్ నిర్వాహకులు, సీనియర్ నేత విట్టా రమేష్ మాట్లాడుతూ యువతకు, పిల్లలకు స్కిల్ డెవల్‌పమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించే లక్ష్యంతో అత్యాధునిక గేమింగ్ జోన్, జిమ్‌లతో పాటు సాంకేతికత వసతులతో ఈ మాల్‌ను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, రజక కార్పొరేషన్ చైర్‌పర్సన సావిత్రమ్మ, మార్క్‌ఫెడ్ చైర్మన్ టీజీ పాండురంగారావు, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, నిర్వాహకుడు అశ్విన్, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.