Share News

డబ్బుతోనే రాజకీయం చేయలేం!

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:17 AM

‘డబ్బులతోనే రాజకీయం చేయలేం. ప్రజలకు మనపై నమ్మ కం ఉండాలి. డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే డబ్బులున్న వాళ్లే రాజకీయం చేస్తారు. మనలాంటి వాళ్లు చేయలేరు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

డబ్బుతోనే రాజకీయం చేయలేం!

  • ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి: సీఎం

  • పొలిటికల్‌ గవర్నెన్స్‌లో పార్లమెంటరీ కమిటీలు కీలకం

  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమన్వయం చేసుకోవాలి

  • పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు

  • నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే

  • క్యాడర్‌ను ఎవరూ విస్మరించకూడదు

  • తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి

  • మనం చేసింది చెప్పుకోవాలి: బాబు

పార్టీలో కార్యకర్తే అధినేత. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడే నాయకులుగా మీరు, పార్టీ శాశ్వతంగా ఉంటాయి. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. వారి ద్వారానే జరగాలి.

- చంద్రబాబు

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘డబ్బులతోనే రాజకీయం చేయలేం. ప్రజలకు మనపై నమ్మ కం ఉండాలి. డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే డబ్బులున్న వాళ్లే రాజకీయం చేస్తారు. మనలాంటి వాళ్లు చేయలేరు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పసు పు జెండా కోసం రక్తం చిందించారు. అనేక త్యాగాలు చేశారు. అందుకే పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయానికి పెద్ద పీట వేస్తున్నాం. సమర్థ నాయకులు తయారు కావడానికి టీడీపీ ఓ వేదిక’ అని తెలిపారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌లో పార్లమెంటరీ కమిటీలు కీలకమని, ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీలు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ‘పదవులు తీసుకున్నవారి పనితీరును 3 నెలలకోసారి అధ్యయనం చేస్తాం. సరిగా చేయకపోతే పక్కన పెట్టి, మరొకరికి అవకాశమిస్తాం’ అని తెలిపారు. తిరుమలేశుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని.. దానినీ సమర్థించుకుంటున్నారంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..


యువరక్తానికి ప్రాధాన్యం..

మరింత సమర్థంగా పనిచేసేలా పార్టీ రోజురోజు కూ బలోపేతం కావాలి. అందుకే యువరక్తానికి ప్రాధాన్యం ఇచ్చాం. 2024 ఎన్నికల్లో 80 శాతం మంది కొత్తవారికి, చదువుకున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాం. దేశంలోనే యంగ్‌ పార్లమెంటరీ పార్టీగా టీడీపీ ఉంది. సమర్థులకు పెద్దపీట వేశాం. 2024 ఎన్నికల్లో కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయో.. 2029లో అంతకు 10 ఓట్లు అదనంగా రావాలి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 ఎన్నికలనాటి కంటే కూటమి మరింత బలోపేతమైంది. ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్లడం కాదు.. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు వారితో మమేకం కావాలి. పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు. ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతా. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి పనిచేయాలి. వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత నాయకత్వం, శ్రేణులపై ఉంది. నాయకులెవ్వరూ క్యాడర్‌ను విస్మరించకూడదు. ఎవరికి కేటాయించిన పదవుల్లో వారే పనిచేయాలి. కావాలని ఎక్కడైనా వివాదాలు సృష్టిస్తే పక్కన పెడతాం.


రెవెన్యూ అతి పెద్ద సమస్య..

ఆర్థికేతర సమస్యల్లో రెవెన్యూ పెద్ద సమస్య. ఎన్నికల ముందు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రద్దు చేశాం. గత ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాన్ని తెచ్చింది. ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడా చెప్పుకోకుండా హైకోర్టుకు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. ఇది సామాన్యులకు సాధ్యమేనా? పట్టాదార్‌ పాస్‌పుస్తకాలపై తమ ఫొటోలు ముద్రించుకున్నారు. పొలం సరిహద్దు రాళ్లపై ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22ఏ జాబితాలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలూ ఉపయోగించారు. అందుకే మళ్లీ రీసర్వే చేసి సమస్యలు లేకుండా ఏడాదిలో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇస్తాం.


క్రెడిట్‌ చోరీ అంటూ అసత్యాలు: మాట్లాడితే క్రెడిట్‌ చోరీ అంటూ అసత్యాలు వల్లె వేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి 2,500 ఎకరాలు కేటాయిస్తే అందులో 500 ఎకరాలు కొట్టేయాలని చూశారు. మనం వచ్చాక మళ్లీ విమానాశ్రయం పనులు పరుగులు పెట్టించి జూన్‌కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. రాజధానిగా అమరావతికి అభ్యంతరం లేదని చెప్పి ఆ తర్వాత అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు మళ్లీ మనం రాజధానికి జీవం పోశాం. అమరావతే మనకు రాజధాని. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కూడా ఏర్పాటు చేస్తాం. రాజధాని పనులు వేగంగా జరుగుతుండడంతో ఇప్పుడు మళ్లీ సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ కొత్త పాట ఎత్తుకున్నారు. రాజకీయాల్లో ఉండేవారికి స్థిరత్వం ఉండాలి. హంద్రీ-నీవా నీటిని కుప్పం తెస్తున్నామంటూ డ్రామా ఆడారు. మరుసటి రోజే గేటు ఎత్తుకుపోయారు. వెలిగొండను సైతం పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారు.


తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి..

మనం చేసే పనులు ఎంత ముఖ్యమో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యం. సోషల్‌ మీడియా, మీడియాలోనే కాదు.. మౌత్‌ టు మౌత్‌ కూడా చెప్పాలి. ఏ అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమం జరిగినా కార్యకర్తలు ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. మనం చేసింది చెప్పుకోవాలి. పార్టీలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తలు కూడా మారాలి. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో గెలిచేలా సంకల్పం తీసుకోవాలి.

Updated Date - Jan 28 , 2026 | 05:49 AM