వార్డుల పెంపునకు శ్రీకారం
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:38 PM
నగర, మున్సిపాలిటీల పరంగా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వాటాలో డివిజనలు, వార్డులు పెంపునకు శ్రీకారం చుట్టింది.
ఆరు మున్సిపాలిటీల్లో వార్డులు పెంపు
జిల్లా వ్యాప్తంగా 178 నుంచి 212కు పెరిగిన వార్డులు
నంద్యాల, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): నగర, మున్సిపాలిటీల పరంగా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వాటాలో డివిజనలు, వార్డులు పెంపునకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నగర, మున్సిపాలిటీల్లో డివిజనలు, వార్డులు పెంచుతూ ఆశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపతకుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కూడా వార్డులు పెంచి నట్లు పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీని కార్పొరేషన చేస్తారని అందరూ భావించారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీగానే పరగణిస్తూ వార్డులను పెంచారు. జిల్లాలోని ఆరు మున్పిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న 178 నుంచి 212 వార్డులుగా పెంచినట్లైంది. ఏది ఏమైనా వార్డుల పునర్విభజనతో ఆశావహులతో పాటు మహిళా రిజర్వేషనతో వారిలో కూడా ఆనందోత్సవం మొదలైంది.
జిల్లాలో పరిస్థితి ఇలా...
నంద్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం 42 వార్డులు ఉండగా 52 వార్డులు అయ్యాయి. ఆళ్లగడ్డలో 27వార్డులకు గానూ 32, డోనలో 32వార్డులకు గానూ 36, ఆత్మకూరులో 28వార్డులకు గానూ 32, బేతంచెర్లలో 20 వార్డులకు గానూ 28, నందికొట్కూర్‌లో 29వార్డులకు గానూ 32కు చేరాయి.