6తో ముగియనున్న ‘ఉమీద్’ గడువు
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:31 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్‌లో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాల నమోదుకు గడువు ఈనెల 6తో ముగియనుందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల వివరాలు వెంటనే నమోదు చేయాలి
ముతవల్లీలు, నిర్వాహకులు వెంటనే స్పందించాలి: అజీజ్
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్‌లో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాల నమోదుకు గడువు ఈనెల 6తో ముగియనుందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇప్పటికీ వివరాలు నమోదు చేయని వక్ఫ్ సంస్థలు, ముతవల్లీలు వెంటనే స్పందించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని వేలాది వక్ఫ్ సంస్థల ఆస్తుల వివరాలు ఇప్పటికే ఉమీద్ పోర్టల్‌లో నమోదయ్యాయని తెలిపారు. అయితే, కొందరు ముతవల్లీలు, నిర్వాహకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, భవిష్యత్తు న్యాయపరమైన పోరాటాలు, ఆక్రమణల నివారణ, డిజిటల్ రికార్డుల సృష్టికి ఉమీద్ పోర్టల్ అత్యంత కీలకమని తెలిపారు. గడువు పొడిగించే అవకాశం లేనందున చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని వివరాలు, పత్రాలు రికార్డులను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వక్ఫ్ ఆస్తులను రక్షించుకోవాలంటే ముందుగా వాటిని ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయడం అత్యవసరమని తెలిపారు. ప్రతి ముతవల్లీ ఈ అంశాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నమోదు చేసే సమాచారం భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తుల రక్షణకు కవచంగా నిలుస్తుందని పేర్కొన్నారు.