Share News

భూమి మ్యుటేషన్‌కు లక్షన్నర డిమాండ్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:33 AM

భూమి మ్యుటేషన్‌ కోసం రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం వీఆర్వో పోతుల శంకరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు.

భూమి మ్యుటేషన్‌కు లక్షన్నర డిమాండ్‌

  • లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): భూమి మ్యుటేషన్‌ కోసం రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం వీఆర్వో పోతుల శంకరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు. విశాఖ నగరానికి చెందిన ఒకరు పి.భీమవరం రెవెన్యూ పరిధిలో 2022వ సంవత్సరంలో 2.54 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి 1-బి అడంగల్‌ కాపీ కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే జరిగినప్పుడు ఆ భూమికి సంబంధించిన రికార్డుల్లో విక్రయదారుడి పేరునే కొనసాగించారు తప్ప, కొనుగోలుదారుడి పేరు నమోదు చేయలేదు. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి మ్యుటేషన్‌ చేయాలని గతేడాది డిసెంబరు 15న దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వీఆర్వో పోతుల శంకరరావును సంప్రదించగా రూ.1.5 లక్షలు లంచం ఇవ్వాలని లేకుంటే దరఖాస్తు ముందుకు కదలదని చెప్పారు. ఈ క్రమంలో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం రూ.1.5 లక్షలు తీసుకువెళ్లి వీఆర్వోకు ఇచ్చారు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. శంకరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 05:34 AM