రాష్ట్ర సచివాలయంలో సర్ శిబిరం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:49 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అమరావతి సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని..
ప్రారంభించిన సీఈవో వివేక్ యాదవ్
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అమరావతి సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ శిబిరం కొనసాగనుంది. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు(అప్సా) రామకృష్ణతో కలిసి సీఈవో పరిశీలించారు. ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయడం, ఆన్‌లైన్ సబ్‌మిషన్, 2002 ఓటర్ల జాబితాలతో సరిపోల్చుకోవడం వంటి అంశాలపై ఎన్నికల సిబ్బంది ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, సర్ ప్రత్యేక శిబిరాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.