Vocational Education: బడి నుంచే వృత్తి విద్య
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన వృత్తి విద్యా నైపుణ్యాలు చేరువ అవుతున్నాయి.
విద్యార్థుల భవితకు సరికొత్త బాటలు!
6-12 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో నైపుణ్య విద్యా శిక్షణ
1,599 ఉన్నత స్కూళ్లలో కోర్సులు
3.28 లక్షల మందికి భవిష్యత్తుకు ఉపయోగపడేలా పునాది
వచ్చే ఏడాది టెన్త్‌లో ‘వృత్తి’ మార్కులు
6-12 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో నైపుణ్య విద్యా శిక్షణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన వృత్తి విద్యా నైపుణ్యాలు చేరువ అవుతున్నాయి. ఉన్నత విద్యకు చేరుకునే సరికి వారిలో నైపుణ్య స్థాయిలు పెంచడం ద్వారా ఏకోర్సునైనా ఎంచుకునేలా తర్ఫీదు ఇస్తున్నారు. 2016-17లో పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రారంభించినప్పుడు 8 వేల మంది విద్యార్థులు మాత్రమే వృత్తి విద్యా కోర్సులు చదివారు. అది ఇప్పుడు 3,28,255కు చేరింది. 164 మోడల్ స్కూల్స్, 30 రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ పాఠశాలలు, 189 సాంఘిక, 26 గిరిజన, 20 బీసీ సంక్షేమ పాఠశాలలు, 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, 670 ఎంపీ, జడ్పీ పాఠశాలలు, 36 మున్సిపల్ పాఠశాలలు, 95 ప్రభుత్వ పాఠశాలలు, 17 ఆశ్రమ పాఠశాలల్లో ఒకేషనల్ కోర్సులు అమలు చేస్తున్నారు. ఇక, రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,500 ఉన్నత పాఠశాలల్లో కూడా వృత్తి విద్యా కోర్సులు అమలుచేయాలని సమగ్రశిక్షా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పుస్తకాలకే పరిమితం కాకుండా..
అనేక దేశాల్లో పాఠశాల విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కావడంలేదు. అనుభవపూర్వక విద్యా విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల వృత్తులపై అవగాహన పెరగడంతో పాటు జీవితాంతం గుర్తుండేలా మేలు చేస్తుంది. మన రాష్ట్రంలో విద్య అంటే పుస్తకాలతో కుస్తీ పట్టే విధానమే ఉంది. ఆ స్థానంలో అనుభవ పూర్వక విద్యా విధానాన్ని విస్తరించడమే లక్ష్యంగా పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు అమలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో స్కిల్ పోటీలు కూడా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 260 స్కిల్ ప్రాజెక్టులు రూపొందించి విజయవాడలో ప్రదర్శించారు.
అనేక రంగాల్లో కోర్సులు
వివిధ రంగాల్లో కోర్సులను పాఠశాల విద్యలో అమలు చేస్తున్నారు. విద్యార్థులు వారి అభిరుచి ఆధారంగా వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, ఆటోమొబైల్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, బ్యాంకింగ్-ఆర్థిక సేవలు, ఎలక్ర్టానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, రిటైల్, విద్యుత్ రంగాల్లో వృత్తి విద్యా కోర్సులు అమలవుతున్నాయి. వాటిని నేర్పించడమే కాకుండా ఇన్‌టర్న్‌షి్‌పలు, ఇండస్ర్టియల్ విజిట్ వంటివి అమలు చేస్తున్నారు. విద్యార్థులను ఆయా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో అమ్మకాలు, హెల్త్ కేర్‌లో రోగికి బీపీ, ఇతర ప్రాథమిక అంశాల పరిశీలన వంటివి నేర్పుతున్నారు. మొత్తంగా 11 విభాగాల్లో 27 ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై కోర్సులు చేరువ చేశారు. ఏవైనా కారణాలతో ఉన్నత విద్యలో ముందుకు సాగకపోయినా వృత్తి విద్యను మెరుగుపరుచుకుని ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది.
సౌకర్యాలతో బోధన
2016-17లో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించినా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో సౌకర్యాల కల్పన చేపట్టారు. 2,701 పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 41 పాఠశాలల్లో ‘హబ్ అండ్ స్పోక్’ విధానంలో ప్రయోగ శాలలు నిర్మించారు. అలాగే వృత్తి విద్యా బోధనకు పూర్తిస్థాయిలో ట్రైనర్లను నియమించారు. జాతీయస్థాయిలో పాఠశాల స్థాయి వృత్తి విద్యకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో సమగ్రశిక్ష 38 పాఠ్యపుస్తకాలను ట్రైనర్ల ద్వారా రూపొందించింది.
ఉన్నత విద్యలో ప్రయోజనం: ఎస్పీడీ
పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులు నేర్పడం వల్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. ‘చదువుతూ నేర్చుకోవడం వేరు. స్వయంగా పనిచేస్తూ నేర్చుకోవడం వేరు. పాఠశాల విద్య పూర్తయ్యే నాటికి వృత్తి విద్యా సర్టిఫికెట్ అందటంతో పాటు జీవితంలో ముందుకు సాగే నైపుణ్యంపై అవగాహన ఏర్పడుతుంది. పుస్తకాలు జ్ఞానానికి మార్గం చూపితే, నైపుణ్యం జీవించడానికి ఆధారంగా మారుతుంది. ఉన్నత విద్యలో ఇవే వృత్తి విద్యా కోర్సులు చదివే వారు ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తారు. విద్యార్థులు స్వయంగా పనిచేస్తూ నేర్చుకోవాలన్నది మా లక్ష్యం. మంత్రి లోకేశ్ నేతృత్వంలో మరింత సమర్థంగా అమలుచేస్తాం’ అన్నారు.
మార్కుల మెమోలో
2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో వినూత్న మార్పు తీసుకురానున్నారు. ప్రస్తుతం టెన్త్ మార్కుల మెమోల్లో కేవలం సబ్జెక్టుల మార్కులే ఉంటున్నాయి. ఇకపై విద్యార్థి నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సుకు సంబంధించిన మార్కులను కూడా మెమోలో జత చేయనున్నారు. దీనివల్ల విద్యార్థికి అధికారికంగా వృత్తి కోర్సులో సర్టిఫికేషన్ లభిస్తుంది.