వైసీపీ ఆఫీస్‌కు ‘పూసపాటి’ భూమి!
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:26 AM
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు! విజయనగరం ఎస్టేట్‌కు చెందిన ప్రైవేటు భూమిగా ఉన్న సర్వే నంబర్ 569లోని ఎకరం స్ధలాన్ని..
జగన్ హయాంలో అడ్డగోలు వ్యవహారం
ప్రైవేటు స్థలం ప్రభుత్వ భూమిగా మార్పు
విజయనగరంలో కార్యాలయ నిర్మాణం
అశోక్ గజపతిరాజు ఫిర్యాదుతో వెలుగులోకి..
విజయనగరం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు! విజయనగరం ఎస్టేట్‌కు చెందిన ప్రైవేటు భూమిగా ఉన్న సర్వే నంబర్ 569లోని ఎకరం స్ధలాన్ని ప్రభుత్వ భూమిగా చెబుతూ తన పార్టీకి 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టేసుకుంది. దీనిపై విజయనగరం సంస్థానం వారసుడు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యాలయం కోసం కేటాయించిన ఎకరా స్థలం విజయనగరం సంస్థానానిదేనని, ఈ భూమి 2022 ఫిబ్రవరి 8 వరకూ రికార్డుల్లో ప్రైవేటు భూమిగానే ఉండేదని, అ తర్వాత ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, చట్టబద్ధ వారసులకు సమాచారం లేకుండా రికార్డులు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమి దివంగత పీవీజీ రాజు వారసులకు చెందుతుందని, తాను కూడా చట్టబద్ధ వారసుడినని తెలిపారు.
జరిగింది ఇదీ..
విజయనగరం సంస్థానానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం సంస్థానాల విలీన ప్రక్రియతో అవన్నీ ప్రైవేటు ఆస్తులుగా మారాయి. అశోక్‌గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు ట్రస్టీగా మారారు. ఆయన పర్యవేక్షణ, సంరక్షణలో మాన్సాస్ ట్రస్టు పేరుతో భూముల బదలాయింపు జరిగింది. మహారాజుపేట సర్వే నంబర్ 569 సర్వే రికార్డుల్లో (4 ఎకరాల 76 సెంట్ల భూమి) మొదట విజయనగరం ఎస్టేట్‌కు చెందిన ప్రైవేటు భూమిగా ఉంది. 2022 జనవరి 28న అప్పటి టౌన్ సర్వేయర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుతో కలిసి వెళ్లి తనిఖీ చేసిన తర్వాత.. అది ప్రభుత్వ భూమి అంటూ అప్పటి తహసీల్దార్ ప్రభాకర్‌రావు కలెక్టర్ సూర్యకుమారికి నివేదిక ఇచ్చారు. 2022 జూన్ 23న పూర్తి స్థాయిలో ఆ భూమిని తహసీల్దార్ వైసీపీకి అప్పగించారు. 2012 సెప్టెంబరు 14న వచ్చిన జీవో నెంబరు 571 ప్రకారం ఏపీ సర్వే ఆండ్ బౌండర్సీ యాక్ట్-1923 సెక్షన్ 9(2), 10(2) నిబంధనలు ఉల్లంఘిస్తూ భూ యజమానికి నోటీసులు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని అశోక్ గజపతిరాజు చెబుతున్నారు. దీనిపై గతేడాది మే 23న అప్పటి కలెక్టరుకు లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఇటీవల మరోసారి అన్ని పత్రాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మునిసిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు స్థలంలో కార్యాలయ భవన నిర్మాణాన్ని ఎలా చేపట్టారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయినా.. వైసీపీ నేతల నుంచి స్పందన లేదు.