లోయలో పడిపోయిన పోలీస్ జీపు
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:03 AM
విజయనగరం జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసు విచారణ కోసం ఆదివారం ఉదయం మండలంలోని కొండకరకాం వెళ్లిన విజయనగరం రూరల్ స్టేషన్ పోలీసులు తిరుగు ప్రయాణంలో వస్తూ ప్రమాదానికి గురయ్యారు.
చెట్టు మధ్యలో ఇరుక్కుపోయి కానిస్టేబుల్ మృతి
ఎస్‌ఐ సహా ఇద్దరు పోలీసులకు గాయాలు
విజయనగరం/దాసన్నపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసు విచారణ కోసం ఆదివారం ఉదయం మండలంలోని కొండకరకాం వెళ్లిన విజయనగరం రూరల్ స్టేషన్ పోలీసులు తిరుగు ప్రయాణంలో వస్తూ ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న జీపు గాజులరేగ ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న లోయ వద్దకు వచ్చేసరికి బ్రేకులు ఫెయిలై 20 అడుగుల లోతులో పడిపోయింది. అక్కడ చెట్టును ఢీకొని ఆగిన వాహనంలో ఇరుక్కుపోయిన పోలీసులు బయటకు రాలేక చాలాసేపు ఆర్తనాదాలు చేశారు. కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు గమనించి 108కి ఫోన్ చేశారు. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రజలు వారందరినీ బయటకు తీసుకొచ్చి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కానిస్టేబుల్ శీర రమణ (48) కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతికి, పక్కటెముకలకు గాయాలయ్యాయి. ఏఆర్ కానిస్టేబుల్(డ్రైవర్) రాజుకు వెన్నుపూస తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే ఎస్పీ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రమణ భౌతిక కాయాన్ని పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్, హెచ్‌సీ నాగేంద్రప్రసాద్, కానిస్టేబుల్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హోంమంత్రి అనిత ఫోన్ చేసి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. కానిస్టేబుల్ రమణ మృతి బాధాకరమంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ఽధైర్యం చెప్పారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ రమణను కోల్పోవడం బాధాకరమని చెబుతూ ఆస్పత్రి వద్ద ఎస్పీ దామోదర్ కన్నీరుపెట్టారు. అక్కడే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయన్ను ఓదార్చారు. ప్రమాదంపై పోలీసులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.