నీటిపై గంటలో 30 యోగాసనాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:43 AM
విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ జలయోగా సాధకురాలు డాక్టర్ యార్లగడ్డ గీతాశ్రీకాంత్ జలప్లావన యోగా ప్రదర్శనతో అబ్బురపరిచారు.
‘జలప్లావన’ ప్రదర్శనతో అబ్బురపరిచిన విశాఖకు చెందిన గీతాశ్రీకాంత్
సాగర్‌నగర్(విశాఖపట్నం), జూన్ 13(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ జలయోగా సాధకురాలు డాక్టర్ యార్లగడ్డ గీతాశ్రీకాంత్ జలప్లావన యోగా ప్రదర్శనతో అబ్బురపరిచారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ 30 రకాల యోగాసనాలను సునాయాసంగా వేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శనివారం ఆమె రుషికొండ సాయిప్రియ రిసార్ట్స్‌లో జలప్లావన (నీటిలో మునిగిపోకుండా, ఏ ఆసరా లేకుండా నీటిపై తేలడం) యోగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గీతాశ్రీకాంత్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, శారీరక ధ్రుఢత్వానికి యోగా దోహదపడుతుందన్నారు. జలయోగా సాధన ద్వారా తాను ప్రాణాంతక పరిస్థితుల నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత విభిన్నంగా ఏదైనా చేయాలనే సంకల్పంతో జలయోగాను ఎంచుకున్నట్టు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా గీతాశ్రీకాంత్ నీటిపై పద్మాసనం, పశ్చిమోత్తాసనం, నౌకాసనం, త్రికోణాసనం, సుఖాసనం, మకరాసనం, నమస్కారాసనం, సాష్టాంగ ఆసనం, ధనురాసనం వంటి దాదాపు 30 రకాల ఆసనాలు వేశారు. జలయోగాకు వయసు, బరువుతో సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, పెద్దసంఖ్యలో సందర్శకులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.